Share News

పల్లెల్లో కూటమి ప్రభంజనం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:38 AM

పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజనం సృష్టించింది.

పల్లెల్లో కూటమి ప్రభంజనం

తొలి దశ పోరులో స్పష్టమైన ఆధిక్యం

అనకాపల్లి జిల్లాలో 215 పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ

కూటమి మద్దతుదారులు 163 సర్పంచ్‌ పదవులు కైవసం

టీడీపీ-133, జనసేన- 27, బీజేపీ- 3

వైసీపీ మద్దతుదారులకు 44...

ఎనిమిదిచోట్ల స్వతంత్రుల విజయం

(అనకాపల్లి, పాడేరు-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజనం సృష్టించింది. తొలివిడతగా అనకాపల్లి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు నాలుగింట మూడు వంతుల స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో 80 శాతానికిపైగా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మొత్తం 215 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా..ఏకగ్రీవాలతో కలుపుకొని కూటమి బలపరిచిన అభ్యర్థులు 163 పంచాయతీల సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకున్నారు. వీటిలో 133 పంచాయతీల్లో తెలుగుదేశం, 27 పంచాయతీల్లో జనసేన, మూడు పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అనకాపల్లి, కశింకోట, రోలుగుంట, పరవాడ, సబ్బవరం మండలాల్లో ఏకపక్ష విజయాన్ని నమోదుచేశారు. ఇక వైసీపీ మద్దతుదారులు 44 పంచాయతీల్లో సర్పంచులుగా ఎన్నికయ్యారు. బుచ్చెయ్యపేట మినహా మిగిలిన మండలాల్లో ఒక అంకెకే పరిమితమైంది. స్వతంత్రులు ఎనిమిది పంచాయతీల్లో గెలుపొందారు.

మన్యంలో హోరాహోరీ

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో కూటమి, వైసీపీ పోటాపోటీగా సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నాయి. జిల్లాలో తొలి విడత చింతపల్లి మండలంలో 17, జీకే వీధిలో 16, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే కొయ్యూరు మండలం బాలారం పంచాయతీ ఏకగ్రీవం (టీడీపీ మద్దతు) కాగా, మిలిగిన 32 పంచాయతీలు కలిపి మొత్తం 65 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వాటిలో కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలకు టీడీపీ 13, బీజేపీ 1, వైసీపీ 14, టీడీపీ రెబల్స్‌ 4, ఇతరులు 1 సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నారు. అలాగే చింతపల్లి మండలంలోని 17 పంచాయతీలకు టీడీపీ 5, జనసేన 1, వైసీపీ 8, ఇతరులు ఒకటి గెలుచుకున్నారు. తాజంగి, చౌడుపల్లి పంచాయతీల ఫలితాలు వెలువడాల్సి ఉంది. అలాగే జీకే వీధి మండలంలో 16 పంచాయతీలకు టీడీపీ 3, జనసేన 3, వైసీపీ 7 గెలుచుకున్నాయి. మూడుచోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మూడు మండలాల్లో కూటమి, వైసీపీలుపోటాపోటీగా సర్పంచులను కైవసం చేసుకోవడం విశేషం.

అనకాపల్లి జిల్లాలో మండలాల వారీగా... (తొలివిడత)

మండలం పంచాయతీలు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇతరులు

అనకాపల్లి 30 14 8 -- 4 4

కశింకోట 27 16 5 1 4 1

చోడవరం 32 23 2 -- 7 -

బుచ్చెయ్యపేట 35 22 -- 1 12 --

రావికమతం 28 17 3 -- 7 1

రోలుగుంట 24 21 -- -- 3 --

పరవాడ 15 9 3 -- 3 --

సబ్బవరం 24 11 6 1 4 2

మొత్తం 215 133 27 3 44 8

అల్లూరి జిల్లాలో మండలాల వారీగా...

మండలం మొత్తం టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇతరులు

పంచాయతీలు

చింతపల్లి 17 5 1 0 8 1

గూడెం కొత్తవీధి 16 3 3 0 7 3

కొయ్యూరు 33 13 0 1 14 5

మొత్తం 66 22 4 1 29 9


అతిపెద్ద పంచాయతీ పెదనాగమయ్యపాలెం

సుమారు 4,706 మంది ఓటర్లతో జిల్లాలో ప్రథమ స్థానం

చిన్నపంచాయతీ నారాయణరాజుపేట

అక్కడ అతి తక్కువగా 394 మంది ఓటర్లు

12 పంచాయతీల్లో 1000 కంటే తక్కువ ఓటర్లు

విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 79 పంచాయతీలు మాత్రమే ఉండగా, ఓటర్లపరంగా పలు ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. భీమిలి మండలం నారాయణరాజుపేటలో కేవలం 394 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ పురుషులు 209 మంది, మహిళలు 185 మంది ఉన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్న పంచాయతీల జాబితాలో నారాయణరాజుపేట ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే భీమిలి మండలం పెదనాగమయ్యపాలెంలో జిల్లాలో అత్యధికంగా 4,706 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా మత్స్యకార గ్రామమైన పెదనాగమయ్యపాలెం తీర ప్రాంతంలో ఉంది.

జిల్లాలో నాలుగు వేలు, అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పంచాయతీల్లో భీమిలి మండలం తాళ్లవలస (4,088 మంది), ఆనందపురం మండలం గంభీరం (4,175), ఆనందపురం (4,319 మంది), పద్మనాభం మండలం పాండ్రంకి (4,320 మంది) ఉన్నాయి. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పంచాయతీల జాబితాలో పెదనాగమయ్యపాలెం మొదటి స్థానంలో, పాండ్రంకి రెండో స్థానంలో ఉన్నాయి. వెయ్యి కంటే తక్కువ ఓట్లు ఉన్న పంచాయతీలు జిల్లాలో 12 ఉన్నాయి. ఆనందపురం మండలం ముకుందపురంలో 686, బీడీ పాలెంలో 841, కోలవానిపాలెంలో 695, శిర్లపాలెంలో 777, పేకేరులో 727, భీమిలి మండలం నారాయణరాజుపేటలో 394, బోడమెట్లపాలెంలో 623 మంది, పద్మనాభం మండలంలో శేరిఖండంలో 680, పెంటలో 670 మంది, పెందుర్తిమండలం గవరపాలెంలో 616, జంగాలపాలెంలో 732, జెర్రిపోతులపాలెంలో 918 మంది ఓటర్లు ఉన్నారు.

కాగా జిల్లాలో మొత్తం 1,62,407 మంది ఓటర్లు (పురుషులు 79,630 మంది, మహిళలు 82,777 మంది) ఉన్నారు. పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. అయితే 15 పంచాయతీల్లో మహిళల కంటే పురుషులు స్వల్పంగా అధికంగా ఉన్నారు. మహిళల కంటే పురుషులు ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో పద్మనాభం మండలం బీఆర్‌ తాళ్లవలస, కృష్ణాపురం, పెందుర్తి మండలం సీహెచ్‌ అగ్రహారం, జంగాలపాలెం, భీమిలి మండలం అన్నవరం, దాకమర్రి, మజ్జివలస, మూలకుద్దు, నారాయణరాజుపేట, సింగన్నబంద, ఆనందపురం మండలం చందక, గండిగుండం, గిడిజాల, ముకుందపురం, ముచ్చెర్ల పంచాయతీలు ఉన్నాయి.

Updated Date - Nov 27 , 2026 | 01:38 AM