పల్లెల్లోనూ కూటమి ప్రభంజనం
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:56 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు నాలుగింట మూడు వంతుల స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో 80 శాతానికిపైగా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మొత్తం 215 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఏకగ్రీవాలతో కలుపుకొని కూటమి బలపరిచిన అభ్యర్థులు 163 పంచాయతీల సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు.
తొలి దశ పంచాయతీ పోరులో స్పష్టమైన ఆధిక్యం
స్రైక్‌రేట్ 75.81 శాతం
ఎన్నికలు జరిగిన పంచాయతీలు 215
కూటమి మద్దతుదారులు 163 సర్పంచ్ పదవులు కైవసం
టీడీపీ- 133, జనసేన- 27, బీజేపీ- 3
44 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు...
ఎనిమిదిచోట్ల స్వతంత్రుల విజయం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి/ న్యూస్‌నెట్‌వర్క్)
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు నాలుగింట మూడు వంతుల స్థానాల్లో విజయం సాధించారు. ఇందులో 80 శాతానికిపైగా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మొత్తం 215 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఏకగ్రీవాలతో కలుపుకొని కూటమి బలపరిచిన అభ్యర్థులు 163 పంచాయతీల సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. వీటిలో 133 పంచాయతీల్లో తెలుగుదేశం, 27 పంచాయతీల్లో జనసేన, మూడు పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అనకాపల్లి, కశింకోట, రోలుగుంట, పరవాడ, సబ్బవరం మండలాల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. ఇక ప్రతిపక్ష వైసీపీ మద్దతుదారులు 44 పంచాయతీల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ ఉనికిని చాటుకుంది. బుచ్చెయ్యపేట మినహా మిగిలిన మండలాల్లో ఒక అంకెకే పరిమితమైంది. స్వతంత్రులు ఎనిమిది పంచాయతీల్లో గెలుపొందారు.
మండలాల వారీగా ఎవరికెన్ని సర్పంచ్ పదవులు...
అనకాపల్లి మండలంలో 30 పంచాయతీలకుగాను కూటమి 22 పంచాయతీల్లో పాగా వేసింది. వీటిలో 14 పంచాయతీల్లో టీడీపీ, ఎనిమిదిచోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారులు నాలుగుచోట్ల, స్వతంత్రులు మరో నాలుగుచోట్ల గెలిచారు.
కశింకోట మండలంలో కూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం 27 పంచాయతీలకుగాను 16 పంచాయతీల్లో టీడీపీ, ఐదుచోట్ల జనసేన, ఒక పంచాయతీలో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు నాలుగుచోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు.
సబ్బవరం మండలంలో 18 పంచాయతీల్లో కూటమి విజయబావుటా ఎగురవేసింది. 11 పంచాయతీల్లో టీడీపీ, ఆరుచోట్ల జనసేన, ఒక పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగుచోట్ల వైసీపీ మద్దతుదారులు, రెండు పంచాయతీల్లో స్వతంత్రులు గెలిచారు.
పరవాడ మండలంలో 15 పంచాయతీలకుగాను కూటమి మద్దతుదారులు 12 పంచాయతీల్లో విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మూడుచోట్ల గెలిచారు. కూటమిలో తెలుగుదేశం మద్దతుదారులు 9 పంచాయతీలను, జనసేన మద్దతుదారులు మూడు పంచాయతీలను కైవసం చేసుకున్నారు.
చోడవరం మండలంలో తెలుగుదేశం మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 32 పంచాయతీలకుగాను కూటమి 25 పంచాయతీల్లో గెలుపొందింది. ఇందులో 23 పంచాయతీల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. రెండుచోట్ల జనసేన, ఏడు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు.
రోలుగుంట మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. మొత్తం 24 గ్రామ పంచాయతీలకుగాను 21 పంచాయతీల్లో సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష వైసీపీ మద్దతుదారులు మూడు పంచాయతీల్లో మాత్రమే గెలుపొందారు.
బుచ్చెయ్యపేట మండలంలో 35 పంచాయతీలకుగాను టీడీపీ మద్దతుదారులు 22 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. బీజేపీకి ఒక స్థానం లభించింది. ఇక ప్రతిపక్ష వైసీపీ 12 పంచాయతీల్లో పాగా వేసి, పట్టు నిలుపుకుంది. జిల్లాలో వైసీపీకి అత్యధిక పంచాయతీలు వచ్చింది ఈ మండలంలోనే కావడం గమనార్హం.
రావిమకతం మండలంలో నాలుగింట మూడొంతుల పంచాయతీలను కూటమి కైవసం చేసుకుంది. మొత్తం 28 పంచాయతీలకుగాను టీడీపీ మద్దతుదారులు 17చోట్ల, జనసేన మద్దతుదారులు మూడుచోట్ల సర్పంచులుగా విజయం సాధించారు. వైసీపీ మద్దతుదారులు ఏడు పంచాయతీల్లో గెలిచారు.
సర్పంచులుగా బండారు, పీవీఎస్ఎన్ రాజు సతీమణులు
మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి భార్య మాధవీలత వెన్నెలపాలెం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో పోటీ చేసి 38 ఓట్ల మెజారిటీతో వైసీపీ బలపర్చిన వెన్నెల అరుణకుమారిపై గెలుపొందారు.
రావికమతం మండలం కొత్తకోట మేజరు పంచాయతీలో జనసేన మద్దతుతో పోటీ చేసిన చోడవరం నియోజకవర్గం ఇన్చార్జి పీవీఎస్ఎన్ రాజు భార్య పాకలపాటి సునీత 1,285 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన వెల్లంకి రాజేశ్వరిపై గెలుపొందారు
సబ్బవరం మండలం మొగలిపురంలో ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ పెద్ద కోడలు, టీడీపీ బలపరిచిన సబ్బవరపు భానురోషిణి, వైసీపీ మద్దతుతో పోటీ చేసిన గండి తులసీభవాని చేతిలో 520 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.
అత్యల్ప మెజారిటీలు..
రోలుగుంట మండలం జానకిరాంపురం సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీచేసిన లగుడు లక్ష్మీకళ, వైసీపీ మద్దతుతో పోటీచేసిన లగుడు నారాయణమ్మపై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
చోడవరం మండలం తిమ్మనపాలెంలో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన గెంజి ఉష ఐదు ఓట్ల మెజారిటీతో వైసీపీ బరపరిచిన గొర్లె వరలక్ష్మిపై గెలిచారు. దుడ్డుపాలెంలో వైసీపీ బలపరిచిన అయితి రమణ ఆరు ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన జీవీ సత్యనారాయణపై, నరసాపురంలో వైసీపీ బలపరిచిన దొడ్డి వరలక్ష్మి నాలుగు ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన దొడ్డి భారతిపై గెలిచారు.
రావికమతం మండలం కొమిర సర్పంచ్‌గా వైసీపీ బలపరిచి గొర్లె సత్యవమ్మ 10 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన గొర్లె రమణమ్మపై గెలుపొందారు.