Share News

పోషకాహారం తెలియని గ్రామం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:10 PM

మండలంలోని గాలికొండ పంచాయతీ పాత్రుగుంట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందడం లేదు.

పోషకాహారం తెలియని గ్రామం
అంగన్‌వాడీ సేవలు అందించాలని అభ్యర్థిస్తున్న బాలింతలు

పాత్రుగుంటలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందని వైనం

అంగన్‌వాడీ సేవలకు దూరం

పట్టించుకోని ఐసీడీఎస్‌, జిల్లా అధికారులు

గూడెంకొత్తవీధి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గాలికొండ పంచాయతీ పాత్రుగుంట గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తుందన్న సంగతి కూడా ఈ గ్రామస్థులకు తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐసీడీఎస్‌, జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఈ గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

పాత్రుగుంట గ్రామంలో యాభై ఏళ్లుగా ఆదిమజాతి ఆదివాసీ(పీవీటీజీ)లు నివాసముంటున్నారు. ప్రస్తుతం 35 కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఐదేళ్లు పైబడిన చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఆదివాసీలందరూ పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఐదేళ్లలోపు చిన్నారులు 16 మంది, బాలింతలు 15 మంది ఉన్నారు. ఇప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేసే పోషకాహారం ఏవిధంగా ఉంటుందో తెలియదని స్థానిక గిరిజన బాలింతలు, గర్భిణులు చెబుతున్నారు. అలాగే గ్రామానికి చెందిన చిన్నారులు, గర్భిణులకు ఇమ్యూనైజేషన్‌ సైతం క్రమంగా జరగడం లేదు.

అందని అంగన్‌వాడీ సేవలు

గ్రామంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సుదీర్ఘకాలంగా అంగన్‌వాడీ సేవలు అందడం లేదు. సాధారణంగా ప్రతి గ్రామాన్ని ఏదో ఒక అంగన్‌వాడీ పరిధిలో ఉండేలా ఐసీడీఎస్‌ అధికారులు ఏర్పాటు చేయాలి. నాలుగైదు చిన్నగ్రామాలను కలుపుతూ ఒక ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉంటుంది. అయితే పాత్రుగుంట గ్రామంలో ఏ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉందో?, పోషకాహారం పంపిణీ చేసే జాబితాలో గ్రామ చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉన్నారో?, లేదో? స్థానిక గిరిజనులకు తెలియదంటున్నారు. ఐసీడీఎస్‌ అధికారులు ఏనాడూ గ్రామాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందుతుందా?, లేదా? అని పరిశీలించలేదు.

ప్రత్యేక పోషకాహారానికి దూరం

ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఆదివాసీ చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నియంత్రించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రత్యేక పోషకాహారం పంపిణీ చేస్తోంది. మైదాన ప్రాంత అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా, గిరిజన ప్రాంతంలో సంపూర్ణ పోషణ ప్లస్‌ అందిస్తోంది. ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు నెలకు 2.5 కిలోల అత్యంత పోషక విలువలు కలిగిన బాలామృతం ప్యాకెట్‌, ఆరు లీటర్ల పాలు, 30 గుడ్లు అందజేస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి రోజు భోజనం, గుడ్డు, 200 గ్రాముల పాలు అందిస్తోంది. గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల బియ్యం, కిలో పప్పు, అరకిలో నూనె, 25 గుడ్లు, ఐదు లీటర్ల పాలతో పాటు అదనంగా కిలో రాగి, రెండు కిలోల గోధుమ పిండి, అర కిలో చిక్కీ, అర కిలో బెల్లం, అర కిలో ఎండు ఖర్జూరం ఇస్తోంది. ఈ పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులను ఖర్చు చేస్తోంది. అయితే పాత్రుగుంట గిరిజనులకు ఈ పోషకాహారం అందడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి తమ గ్రామంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందించేందుకు చొరవ తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:10 PM