విగ్రహాలకు ముసుగు
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:08 AM
జీవీఎంసీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ బుధవారం నోటిఫికేషన్ జారీచేశారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో అధికారులు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. నగర పరిధిలోని దివంగత రాజకీయ నేతలు, ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. కూడళ్లు, రోడ్లపక్కన ఏర్పాటుచేసిన రాజకీయ నేతలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
కోడ్ అమలులోకి రావడంతో చర్యలు ప్రారంభించిన అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ బుధవారం నోటిఫికేషన్ జారీచేశారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దీంతో అధికారులు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. నగర పరిధిలోని దివంగత రాజకీయ నేతలు, ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. కూడళ్లు, రోడ్లపక్కన ఏర్పాటుచేసిన రాజకీయ నేతలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
జీవీఎంసీ ఎన్నికలకు కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, పోటీకి దిగే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సిందేనని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిసనర్ కేతన్గార్గ్ స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్లు ముద్రించినప్పుడు వాటిపై ప్రింటింగ్ ప్రెస్పేరు, చిరునామా, ముద్రణ చేయించిన వ్యక్తి పేరు, చిరునామా, ఎన్ని కాపీలు ముద్రించారనే వివరాలు ఉండాలన్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారికి, అదనపు ఎన్నికల అథారిటీకి తప్పకుండా అందజేయాలన్నారు. అభ్యర్థులు ప్రచారానికి వాహనాలను వాడితే రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. ఎన్నికల ప్రచారానికి, ఫ్లెక్సీలు ప్రదర్శించడానికి ప్రభుత్వ స్థలాలను ఉపయోగిస్తే చర్యలకు గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రైవేటు భవనాలు, స్థలాల్లో ఏర్పాటుచేస్తే సదరు ఆస్తి యజమాని అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును తనిఖీ చేసేందుకు జీవీఎంసీ అధికారులతో కూడిన పది బృందాలను ఏర్పాటుచేశామన్నారు.