Share News

బైక్‌ను ఢీకొన్న వ్యాన్‌... యువకుడి మృతి

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:43 AM

అచ్యుతాపురం- పూడిమడక రోడ్డులో కోనెంపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.

బైక్‌ను ఢీకొన్న వ్యాన్‌... యువకుడి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

డెయిరీ ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్థులు

రూ.15 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకారం

అచ్యుతాపురం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

అచ్యుతాపురం- పూడిమడక రోడ్డులో కోనెంపాలెం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సీఐ చంద్రశేఖర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (26), రావాడ శ్రీను సెజ్‌లోని ఒక కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఆదివారం ‘బి’ షిఫ్ట్‌కు వెళ్లిన వీరు.. ఎర్రవరంలో ఆదివారం రాత్రి స్నేహితుని పుట్టిన రోజు వేడుకలు వుండడంతో గంటముందు అనుమతి తీసుకొని తొమ్మిది గంటలకు బయటకు వచ్చారు. బైక్‌పై ఎర్రవరం వస్తుండగా అమూల్‌ డెయిరీ వద్ద ఎడమ వైపు నుంచి పాల క్యాన్లతో వస్తున్న వ్యాన్‌ ఒక్కసారిగా కుడివైపుకు తిప్పాడు. దీంతో పాలవ్యాన్‌ వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. బైక్‌ నడుపుతున్న సాయి తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అక్కడ వున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వెంకటరావు, సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లారు. సాయిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా వుండడంతో అనకాపల్లి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. శ్రీనుని 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా పాల వ్యాన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందాడని, మరో యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని ఆరోపిస్తూ ఎర్రవరం గ్రామస్థులు ఆదివారం రాత్రి నుంచి డెయిరీ వద్ద ఆందోళనకు దిగారు. సాయి తండ్రి గతంలోనే చనిపోయాడని, ఇతని సంపాదనతోనే తల్లి, చెల్లిని పోషిస్తున్నాడని, ఇప్పుడు సాయి కూడా చనిపోవడంతో వీరికి దిక్కెవరని ఆగ్రహంతో ప్రశ్నించారు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీనుకి భార్య, కుమార్తె వున్నారు. ప్రస్తుతం శ్రీను భార్య గర్భవతిగా ఉంది. కాగా వ్యాన్‌ యజమానితోపాటు, డెయిరీ యాజమాన్యం రూ.15 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.


రేషన్‌ దుకాణాల్లో గోధుమ పిండి

కిలో రూ.20కే సరఫరా

ఇప్పటికే అర్బన్‌ ప్రాంతాల్లో విక్రయాలు

కార్డుదారుల నుంచి మంచి స్పందన

వచ్చే నెల నుంచి మండల కేంద్రాల్లో సైతం అమ్మకాలు

అనకాపల్లి, పిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని రేషన్‌ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా జనవరి నుంచి కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి ధర రకాన్ని బట్టి రూ.40 నుంచి రూ.60 వరకు వుంది. అయితే రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన గోధుమ పిండిని కిలో రూ.20కే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లోని రేషన్‌ డిపోల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించారు. మార్చి నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో రేషన్‌ కార్డుదారులకు గోధుమ పిండిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనకాపల్లి నర్సీపట్నం, ఎలమంచిలి అర్బన్‌ ప్రాంతాల్లో కార్డుదారులకు గోధుమ పిండి కిలో రూ.20కి అందిస్తున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి కేఎల్‌వీఎన్‌ మూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున గోధుమలను దిగుమతి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు నాణ్యమైన గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో రేషన్‌ కార్డుదారులు గోధుమ పిండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్డుదారుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోని రేషన్‌ డిపోల్లో గోధుమ పిండి కిలో రూ.20కే అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు ఇండెంట్‌ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Feb 10 , 2026 | 01:44 AM