నిరుపయోగంగా డిజిటల్ కొలతల షెడ్డు
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:38 PM
ఆదివాసీ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కచ్చితమైన తూకానికి సంతల్లో విక్రయించేందుకు అనువుగా నిర్మించిన డిజిటల్ మెజర్(కొలత) షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి.
వృథాగా పడి ఉన్న తూనిక యంత్రాలు
చింతపల్లి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కచ్చితమైన తూకానికి సంతల్లో విక్రయించేందుకు అనువుగా నిర్మించిన డిజిటల్ మెజర్(కొలత) షెడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. వారపు సంతకు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో వర్తకులు తూనికల్లో మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన డిజిటల్ తూనిక యంత్రాలతో కూడిన షెడ్లు వృథాగా పడి ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఏజెన్సీ వ్యాప్తంగా ప్రధాన సంతల్లో డిజిటల్ తూనిక యంత్రాలు, సంత షెడ్లు ఉన్నాయి. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పెదవలస, జీకేవీధి, ధారకొండ, చింతపల్లి, లంబసింగి సంతల వద్ద డిజిటల్ తూనిక యంత్రాలు, సంత షెడ్లు ఉన్నాయి. గిరిజన గ్రామాల నుంచి రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, సేకరించిన అటవీ ఉత్పత్తులను సంత షెడ్‌లో తూకం వేసుకుని డిజిటల్ స్లిప్ తీసుకొని, అదే కొలతలకు వర్తకులు కొనుగోలు చేసేలా నాటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హరినారాయణన్ ఏర్పాట్లు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ డిజిటల్ తూనిక యంత్రాలు తుప్పుపట్టి పోయాయి. షెడ్లు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పాత పద్ధతిలోనే సంతల్లో వర్తకుల వ్యక్తిగత తూనికలకే ఆదివాసీలు సరుకులు విక్రయించుకుంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి డిజిటల్ తూనిక యంత్రాలు, సంత షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఈ ప్రాంత ఆదివాసీలు కోరుతున్నారు.