మైనర్ల ప్రేమ... విషాదాంతం
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:02 AM
పరిపక్వత లేని వయస్సులో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ విషాదకరంగా ముగిసింది.
బావిలో దూకి ఆత్మహత్య
పెందుర్తి/కె.కోటపాడు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
పరిపక్వత లేని వయస్సులో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ విషాదకరంగా ముగిసింది. కన్నవారికి గర్భశోకం మిగిల్చింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన మైనర్లు గురువారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి మండలం చినముషిడివాడ పార్వతీనగర్‌కు చెందిన బాలుడు (16) కొమ్మాదిలో గల శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. పెందుర్తి ప్రశాంతినగర్‌కు చెందిన బాలిక (16) ఆనందపురంలోని ప్రభుత్వ కళాశాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇద్దరూ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పుడు స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. వీరి వ్యవహారం తెలిసి ఇరువురి తల్లిదండ్రులు ఇటీవల పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇదిలావుండగా వినాయక చవితిని పురస్కరించుకుని బాలుడు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలుసుకున్నారు. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతున్నారని భావించారు. బుధవారం రాత్రి బాలుడు అమ్మమ్మ ఊరు అయిన అనకాపల్లి జిల్లా కె.కోటపాడు వెళ్లారు. అక్కడ ఒక నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. కె.కోటపాడు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.