Share News

పరిశ్రమలపై పిడుగు

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:08 AM

యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతుండడంతో ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది.

పరిశ్రమలపై పిడుగు

  • పారిశ్రామిక అవసరాలకు విక్రయించే డీజిల్‌ ధర 25 శాతం పెంపు

  • ఫిషింగ్‌ బోట్లు, షాపింగ్‌ మాల్స్‌లో జనరేటర్లకు, క్రేన్లు, ఎక్స్‌కవేటర్లకు విక్రయించే ఇంధనానికి వర్తింపు

  • ఫిషింగ్‌ హార్బర్‌ బంకులో లీటర్‌ రూ.121.42

  • ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.2 పెంపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతుండడంతో ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. తాజాగా ఇరాన్‌కు చెందిన చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్‌ క్షిపణులతో విరుచుకుపడడంతో కొన్నిరకాల ఇంధన ధరలు పెంచుతున్నట్టు ఆయిల్‌ కంపెనీలు గురువారం ప్రకటించాయి. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే డీజిల్‌ ధరను 25 శాతం పెంచాయి. ఆ ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించడంతో పారిశ్రామిక నగరమైన విశాఖ జిల్లాలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో డీజిల్‌ సగటు ధర రూ.96.24గా ఉంది. పారిశ్రామిక అవసరాలకు కొత్త ధర రూ.121.42గా హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఫిషింగ్‌ హార్బర్‌లోని కో-ఆపరేటివ్‌ బంకులో కూడా అదే ధరకు అమ్ముతున్నారు.

పారిశ్రామిక డీజిల్‌ అంటే...?

డీజిల్‌ను పెద్దమొత్తంలో పారిశ్రామిక అవసరాలకు విక్రయిస్తే దానిని పారిశ్రామిక డీజిల్‌గా వ్యవహరిస్తారు. రిటైల్‌గా అమ్మే డీజిల్‌ను ఆ లెక్కలోకి తీసుకోరు. ప్రధానంగా ఏదైనా పరిశ్రమ తమ అవసరాల కోసం అయిల్‌ కంపెనీ సహకారంతో సొంతంగా బంక్‌ ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి విక్రయాలు సాగిస్తే దానిని పారిశ్రామిక అవసరంగానే గుర్తిస్తారు. ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల వేటకు వెళ్లే బోట్ల కోసం ప్రత్యేకంగా బంక్‌లు ఉన్నాయి. అవన్నీ పారిశ్రామిక విభాగం కిందకే వస్తాయి. అదేవిధంగా ఫార్మా సిటీలో ఉన్న బంకులు కూడా ఆ విభాగంలోకే వస్తాయి. అదేవిధంగా షాపింగ్‌ మాల్స్‌లో ఉపయోగించే జనరేటర్ల కోసం విక్రయించే డీజిల్‌, మైనింగ్‌, నిర్మాణ రంగాల్లో ఉపయోగించే ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లు, పోర్టు ఆపరేషన్లను వినియోగించే క్రేన్లు వంటివి ఆ విభాగంలోకే వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు డీజిల్‌ను కొత్త రేటు ప్రకారం కొనుగోలు చేయాల్సిందే. లీటరుపై 25.20 పెరిగింది.

హైవేపై బంకుల్లో కొంటే సాధారణ ధరే

ఇదే డీజిల్‌ను జాతీయ రహదారి పక్కనుండే బంకుల్లో తీసుకుంటే సాధారణ రేటు అంటే 96.24కే లభిస్తుంది. సరకులు రవాణా చేసే లారీలు, వ్యాన్లు, ప్రయాణికులను తీసుకువెళ్లే ప్రైవేటు ట్రావెల్స్‌ ఈ రేటుకే డీజిల్‌ తీసుకుంటాయి. ఇప్పుడు ఈ బంకుల నుంచి డీజిల్‌ పక్కదోవ పట్టే అవకాశం ఉంది.

ముందుగానే హెచ్చరికలు

సాధారణ బంకుల్లో రిటైల్‌గా విక్రయించే డీజిల్‌ లేదా పెట్రోల్‌ను పెద్దమొత్తంలో ఎవరికీ విక్రయించకూడదని బంకు యజమానులకు ఇప్పటికే ఆయిల్‌ కంపెనీలు ఆదేశాలు ఇచ్చాయి. ఎవరైనా ఆ విధంగా చేసినట్టయితే చర్యలు చేపడతామని హెచ్చరించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎవరికైనా ఎక్కువ మొత్తంలో డీజిల్‌/పెట్రోల్‌ పోస్తే ట్రాకింగ్‌లో తెలిసిపోతుంది. అందుకని యజమానులు కూడా జాగ్రత్తపడుతున్నారు.

ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.2 పెంపు

సాధారణ పెట్రోల్‌ ధర రూ.108.33 ఉండగా ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.115 ఉంది. దీనిని ఇప్పుడు లీటరుకు రెండు రూపాయలు పెంచారు. ఇంజన్‌ స్మూత్‌గా రన్‌ కావడానికి, మైలేజీ ఎక్కువ రావడానికి పవర్‌/స్పీడ్‌ పెట్రోల్‌ వినియోగిస్తారు. దీని వినియోగం తక్కువ.


గ్యాస్‌ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు

పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి జేసీ నిర్వహణ

నిల్వలు, రికార్డులు పరిశీలన

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని పలు గ్యాస్‌ ఏజెన్సీల్లో పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారు లతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నగర పరిధిలోని రఘురామ్‌ గ్యాస్‌ ఏజెన్సీ, అప్‌ల్యాండ్‌ గ్యాస్‌ ఏజెన్సీకి చెందిన గోదాముల్లో సోదాలు చేపట్టారు. రఘురామ్‌ గ్యాస్‌ ఏజెన్సీలో ఉన్న వినియోగదారులతో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి మాట్లాడారు. సమయానికి గ్యాస్‌ సిలిండర్లు అందు తున్నాయా?, ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా.? అని అడిగి తెలుసుకున్నారు. వినియోగదారు లకు సమయానికి గ్యాస్‌ సిలిండర్లు అందించా లని, అవకతవకలు జరగకుండా చూడాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అనం తరం ఆమె కంప్యూటర్‌లో రికార్డులను పరి శీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆ తరువాత అప్లాండ్‌ గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లిన ఆమె సిలిండర్ల నిల్వలు, రికార్డుల నిర్వహణ, సరఫరా విధానం వంటి అంశాలను పరిశీ లించారు. గ్యాస్‌ పంపిణీపై వచ్చిన ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఏవైనా లోపాలు గమనించిన పక్షంలో తక్షణమే సరి చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. గృహ వినియోగానికి ఆటంకం లేకుండా వంట గ్యాస్‌ పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆమె వంట తూనికలు, కొలతల శాఖ అధికారి థామస్‌ రవికుమార్‌, ఇతర అధికారులు ఉన్నారు.


గ్యాస్‌ సరఫరాపై పర్యవేక్షణ

బాట్లింగ్‌ యూనిట్ల వద్ద డిప్యూటీ కలెక్టర్ల నియామకం

మరోవైపు 1.74 లక్షలకు చేరిన నిరీక్షణ జాబితా

సిలిండర్లు ఇవ్వాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి సింహాచలం దేవస్థానం, దివీస్‌ యాజమాన్యం లేఖలు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

వంట గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ బాట్లింగ్‌ యూనిట్ల వద్ద పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్లు ముధుసూదనరావు, టి.గోవింద్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి నియమించారు. ఈ రెండు యూనిట్ల వద్ద సిలిండర్లు ఫిల్లింగ్‌ చేసి జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలకు సరఫరా చేస్తారు. అక్కడ నుంచి వినియోగదారులకు సరఫరా అవుతాయి.

అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రభావం గ్యాస్‌ సరఫరాపై పడింది. దీంతో వినియోగదారులు ఆందోళనతో అవసరం లేకపోయినా సిలిండర్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిలిండర్‌ కోసం వేచిచూస్తున్న వారి జాబితా లక్షన్నర దాటింది. బాట్లింగ్‌ యూనిట్ల నుంచి సాధ్యమైనంత ఎక్కువ సిలిండర్లు సరఫరా అయితే సమస్య కొంతవవరకూ పరిష్కారమవుతుంది. అందుకోసం ఆయా ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో జిల్లా యంత్రాంగం నిత్యం సమీక్షిస్తుంది. ఈ క్రమంలోనే పర్యవేక్షణకు ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు.

1.74 లక్షలకు చేరిన నిరీక్షణ జాబితా

జిల్లాలో 62 ఏజెన్సీల పరిధిలో వంట గ్యాస్‌ సిలిండర్‌ కోసం నిరీక్షించే వినియోగదారుల సంఖ్య శుక్రవారం మధ్యాహ్నానికి 1,74,600కు చేరింది. శుక్రవారం నాటికి జిల్లాలో 29,082 సిలిండర్లు స్టాకు ఉండగా, 20,028 మందికి సరఫరా చేశారు. వినియోగదారుల్లో ఆందోళన కారణంగా నిరీక్షణ జాబితా పెరిగిందని, అయితే రెండు, మూడు రోజుల కంటే శుక్రవారం బుకింగ్స్‌ స్వల్పంగా తగ్గాయని పౌర సరఫరాల అధికారులు తెలిపారు.

సిలెండర్లు ఇవ్వండి

ప్రసాదాల తయారీ, భక్తులను అన్నదానం కోసం గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను సింహాచలం వరాహ నరసింహస్వామి దేవస్థానం అధికారులు కోరారు. ప్రతిరోజు నాలుగు వేల మందికి, శని, ఆదివారాల్లో ఆరు వేల మందికి మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నామని, అందుకు సరిపడా సిలిండర్లు ఇవ్వాలని కోరారు. అలాగే ‘దివీస్‌’ కంపెనీలోని క్యాంటీన్‌లలో ప్రతిరోజు 11 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం/రాత్రి భోజనాలు చేస్తుంటారు. తమకు రోజుకు 650 కిలోల గ్యాస్‌ అవసరమవుతుందని పేర్కొంటూ జిల్లా యంత్రాంగానికి యాజమాన్యం లేఖ రాసింది. క్యాంటీన్ల నిర్వహణకు వాణిజ్య సిలిండర్లు ఇవ్వాలని, లేకపోతే డొమెస్టిక్‌ సిలిండర్ల సరఫరా చేయాలని కోరారు.

10 శాతం మేర వాణిజ్య సిలిండర్లు

జిల్లాలో రెండు రోజుల నుంచి కొద్దిగా (అవసరాల్లో పది శాతం మేర) వాణిజ్య అవసరాలకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన వారం రోజుల తరువాత వ్యాపారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. దీంతో చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయంగా డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తున్నారు. అయితే పెద్ద హోటళ్ల నిర్వాహకులు మాత్రం వాణిజ్య సిలిండర్లు సరఫరా చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం గతంలో రోజుకు 1,200 చొప్పున నెలకు సుమారు 36 వేల సిలిండర్లు సరఫరా చేసేవారు.

Updated Date - Mar 21 , 2026 | 01:08 AM