నిరాడంబరతకు నిదర్శనం
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:08 AM
చిన్నపాటి పార్టీ పదవి ఉన్నా, వార్డు సభ్యుడిగా ఎన్నికైనా వారి జీవన శైలిలో మార్పు కనిపిస్తుంది. డాబు, అధికార దర్పాన్ని చూపిస్తూ కార్లలో తిరిగేవారిని చూస్తుంటాం.
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పదవి వచ్చినా అధికార దర్పాన్ని చూపించని ఊర్మిళ
వారపు సంతలో కూరగాయలు విక్రయిస్తూ సాధారణ జీవనం
పలువురికి ఆదర్శం
చింతపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): చిన్నపాటి పార్టీ పదవి ఉన్నా, వార్డు సభ్యుడిగా ఎన్నికైనా వారి జీవన శైలిలో మార్పు కనిపిస్తుంది. డాబు, అధికార దర్పాన్ని చూపిస్తూ కార్లలో తిరిగేవారిని చూస్తుంటాం. గిరిజన ప్రాంతంలో కొంత మంది రాజకీయ నాయకులు వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తుంది. అయితే చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్‌పర్సన్‌గా కిల్లో ఊర్మిళకు పార్టీ అధిష్ఠానం ఉన్నత పదవి కట్టబెట్టినప్పటికి ఆమె వృత్తిధర్మాన్ని విడిచిపెట్టలేదు. నేటికి వారపు సంతలో సాధారణ మహిళ వలే రహదారి పక్కన దుకాణం ఏర్పాటు చేసుకుని కూరగాయలను విక్రయిస్తూ పలువురికి ఆమె ఆదర్శంగా నిలుస్తున్నది. కిల్లో ఊర్మిళ తన భర్తతో పాటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూనే మరో వైపు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. పొలంలో కూరగాయలను పండించి వారపు సంతకు తీసుకొచ్చి విక్రయిస్తోంది. ఆమెకు పంచాయతీలో, టీడీపీలోనూ మంచి గుర్తింపు ఉంది. గతంలో కొత్తపాలెం పంచాయతీకి ఆమె సర్పంచ్‌గా పనిచేసింది. సర్పంచ్‌గా పనిచేసిన కాలంలోనూ ఆమె కూరగాయల విక్రయాన్ని విడిచిపెట్టలేదు. తాజాగా ఆమె సేవలను గుర్తించి టీడీపీ అధిష్ఠానం చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించింది. గ్రీన్ ఇంక్ పెన్‌తో సంతం చేసే హోదా కలిగిన ఏఎంసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఆమె గతంలో మాదిరిగా చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరిస్తుంది. నిరాడంబరంగా ఉండే రాజకీయ నాయకులకు ఆమె ఒక మార్గదర్శి. ఇప్పటికీ ఆమె భర్తతో పాటు వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొలంలో పండించిన కూరగాయలను తానే మోసుకుని లోతుగెడ్డ జంక్షన్ వారపు సంతకు తీసుకొస్తుంది. వర్తకుల మధ్యలో ఆమె దుకాణం ఏర్పాటు చేసుకుని కూరగాయలను విక్రయిస్తుంది. చలి, ఎండను సైతం లెక్క చేయకుండా పదవిని పక్కన పెట్టి కుటుంబ పోషణ కోసం కూరగాయలను విక్రయిస్తూ కనిపిస్తుంది. ఆమె భర్త కిల్లో పూర్ణచంద్రరావు ప్రస్తుతం టీడీపీ చింతపల్లి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తాను రాజకీయాల్లో రాణించేందుకు తన భర్త పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె తెలిపింది.