Share News

గిరిజనుల సహనానికి పరీక్ష

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:35 PM

మండలంలోని జీకేవీధి-2 స్వర్ణ గ్రామ సచివాలయంలో పింఛన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌ కాకపోవడంతో ఆదివాసీలకు నిరీక్షణ తప్పడం లేదు. సచివాలయానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకపోవడంతో ఆదివాసీల సహనానికి పరీక్షగా మారింది.

గిరిజనుల సహనానికి పరీక్ష
ఇంటర్నెట్‌ లేకపోవడంతో నిరాశ చెందిన గిరిజనులు

జీకేవీధి-2 సచివాలయంలో

అందుబాటులో లేని ఇంటర్నెట్‌ సేవలు

పింఛన్‌ దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేసేందుకు అవస్థలు

రెండు రోజుల్లో ఆరు దరఖాస్తులే ఆన్‌లైన్‌

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి-2 స్వర్ణ గ్రామ సచివాలయం ఆర్‌వీనగర్‌లోని ఏపీఎఫ్‌డీసీ పాత భవనంలో నిర్వహిస్తున్నారు. సచివాలయానికి నూతన భవనం లేదు. ఈ సచివాలయానికి ఇంటర్నెట్‌ సర్వీసు కూడా అందుబాటులో లేదు. దీంతో డిజిటల్‌ అసిస్టెంట్‌ సెల్‌ఫోన్‌ ఇంటర్నెట్‌ కంప్యూటర్‌కి అనుసంధానం చేసి అతి కష్టంపై ఆన్‌లైన్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సచివాలయ పరిధిలోనున్న 16 గ్రామాలున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజులుగా అధిక సంఖ్యలో గ్రామ సచివాలయానికి వస్తున్నారు. సచివాలయంలో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో పింఛన్‌ దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 18కిలోమీటర్ల దూరం నుంచి గిరిజనులు వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి నిరాశతో వెనుదిరుగుతున్నారు. రెండు రోజుల్లో కేవలం ఆరు దరఖాస్తులను మాత్రమే సచివాలయం ఉద్యోగులు ఆన్‌లైన్‌ చేశారు. దీంతో సుమారు 40 మంది గిరిజనులు దరఖాస్తు చేసుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైన జీకేవీధి-2 సచివాలయానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడంతోపాటు పింఛన్లు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:35 PM