Share News

ప్రయాణికుల సహనానికి పరీక్ష

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:49 PM

జిల్లాలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను నడుపుతుండడంతో అవి ఎక్కడబడితే అక్కడ ఆగిపోయి ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి.

ప్రయాణికుల సహనానికి పరీక్ష
మాకవరపాలెంలో మరమ్మతులకు గురై నిలిచిపోయిన సీలేరు- విశాఖపట్నం ఆర్టీసీ బస్సు

అడుగడుగునా ఆగిపోయిన సీలేరు- విశాఖపట్నం ఆర్టీసీ బస్సు

విశాఖపట్నం వెళ్లేలోపు మూడుసార్లు మొరాయింపు

సీలేరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను నడుపుతుండడంతో అవి ఎక్కడబడితే అక్కడ ఆగిపోయి ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. విశాఖపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన సీలేరు- విశాఖపట్నం బస్సు సోమవారం సీలేరు నుంచి ఉదయం ఆరు గంటలకు విశాఖపట్నం బయలుదేరింది. అయితే రేడియేటర్‌లో సాంకేతిక లోపం తలెత్తి లంబసింగి ఘాట్‌రోడ్డులో నిలిచిపోయింది. డ్రైవర్‌ శ్రమించి ఏదో విధంగా బస్సు కదిలే విధంగా చేశారు. మాకవరపాలెం వెళ్లే సరికి మళ్లీ రేడియేటర్‌లో సమస్య ఏర్పడి బస్సు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఎండ వేడికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగడానికి నీళ్లు లేక చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. గంట తరువాత మరమ్మతులు చేసి బయలుదేరగా, అనకాపల్లి వచ్చేసరికి మళ్లీ ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెండు గంటల అనంతరం విశాఖపట్నం బయలుదేరింది.

తరచూ ఇదే సమస్య

ఇటీవల విశాఖపట్నం నుంచి సీలేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు గేర్లు సక్రమంగా పడకపోవడంతో చింతపల్లిలో గంటలకొద్దీ ఆగిపోగా స్థానిక మెకానిక్‌లు వచ్చి గేర్లు పడేటట్టు మరమ్మతులు చేశారు. రెండు గంటల అనంతరం సీలేరు చేరుకోగా, మళ్లీ గేర్లు పడక ఆగిపోయింది. సీలేరు నైట్‌ సర్వీసు బస్సుతో పాటు విశాఖపట్నం- భద్రాచలం బస్సులు కాలం చెల్లినవి కావడంతో తరచూ మరమ్మతులకు గురై ఘాట్‌ రోడ్డులో ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విశాఖపట్నం ఆర్టీసీ డిపో అధికారులు అల్లూరి జిల్లాకు కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:49 PM