Share News

ఉపాధ్యాయుడి సాహస యాత్ర

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:55 AM

ఓ ప్రధానోపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం నుంచి పదిహేను రోజుల్లో లడఖ్‌ వెళ్లి వచ్చారు.

ఉపాధ్యాయుడి సాహస యాత్ర

విశాఖ నుంచి బైక్‌పై లడఖ్‌ యాత్ర

ఉమ్లింగ్‌ లా పాస్‌లో ఎత్తైన శిఖరాన్ని అధిరోహణ

15 రోజుల్లో 6,500 కిలోమీటర్ల ప్రయాణం

గిన్నిస్‌బుక్‌లో నమోదు

మల్కాపురం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

ఓ ప్రధానోపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం నుంచి పదిహేను రోజుల్లో లడఖ్‌ వెళ్లి వచ్చారు. తన యాత్రలో భాగంగా ఇండియా, చైనా సరిహద్దునున్న ఉమ్లింగ్‌ లా పాస్‌లో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించారు. అతి తక్కువ వ్యవధిలో ఈ ఘనత సాధించడంతో ఆయన పేరు గిన్నిస్‌ బుక్‌లో నమోదైంది.

శ్రీహరిపురానికి చెందిన కన్నీడి కృష్ణమోహన్‌ (53) అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన విశాఖలో గల తన ఇంటి నుంచి మే 16న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై బయలుదేరి లడఖ్‌ ప్రాంతంలోని అత్యంత ఎత్తైన ఉమ్లింగ్‌ లా పర్వత శిఖరానికి చేరుకున్నారు. సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని జూన్‌ ఒకటో తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. అతి తక్కువ రోజుల్లో 6,500 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడంతో పాటు అత్యంత ఎత్తైన మోటారబుల్‌ రహదారి ఉమ్లింగ్‌ లా పాస్‌ను (19,024 అడుగులు, సుమారు 5,798 మీటర్లు) అధిరోహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఈ విజయం విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులకు అంకితమన్నారు. 1991లో ఢిలీల్లో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొని రాష్ట్రపతి నుంచి ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందుకున్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పలు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో రిసోర్స్‌ పర్సన్‌గా సేవలందించానన్నారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చానన్నారు. కాగా గిన్నిస్‌ రికార్డు సాధించిన కృష్ణమోహన్‌ను అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి పెన్నాడ అప్పారావు, ఇతర అధికారులు అభినందించారు.

Updated Date - Jun 24 , 2026 | 12:55 AM