Share News

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:11 AM

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు తొలిసారిగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టింది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించి కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన అందిస్తున్నారు. నూతన విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది
చింతపల్లి పాఠశాలలో పదో తరగతిలో రానున్న విద్యార్థులకు గణితం బోధిస్తున్న ఉపాధ్యాయుడు చిట్టినాయుడు

పదో తరగతిలోకి వచ్చే విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు

ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న ప్రక్రియ అమలు

ఇప్పటికే పాఠాల బోధన ప్రారంభం

వేసవి సెలవులు ఇచ్చేలోగా 20 శాతం సిలబస్‌

పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ మార్కుల సాధనే లక్ష్యం

చింతపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు తొలిసారిగా బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టింది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ కోర్సును రూపొందించి కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన అందిస్తున్నారు. నూతన విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల విద్యలో పదో తరగతి కీలకం. పబ్లిక్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్‌లో ఆయా కోర్సుల్లో సీటు లభించే అవకాశం వుంటుంది. దీంతో పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా పరితపిస్తుంటారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో తక్కువ మంది ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు తెర తీసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండేళ్ల నుంచి గణనీయంగా పెరుగుతున్నది. దీంతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందించాలని కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో వంద రోజుల ప్రణాళికను అమలు చేసింది. దీనివల్ల విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్రిడ్జి కోర్సును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

జిల్లాలో 210 గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, 11 ఏకలవ్య, 11 కేజీబీవీలు 22 ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న 15,259 మంది విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు బోధన జరుగుతున్నది.

తొమ్మిదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ముందుగానే పదో తరగతి పాఠాల బోధన ప్రారంభించింది. సాధారణంగా కార్పొరేట్‌ పాఠశాలల్లో మాత్రమే దీనిని అమలు చేస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇదే తరహాలో ముందస్తు బోధన ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు వేసవి సెలవులు మొదలయ్యేలోపు 20 శాతం సిలబస్‌ను పూర్తి చేసేలా బ్రిడ్జి కోర్సును రూపొందించారు. దీనిని మార్చి 13న ప్రారంభించారు. ఏప్రిల్‌ 23 వరకు విద్యాబోధన జరుగుతుంది. విద్యా శాఖ రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు అసెస్‌మెంట్‌-2 పరీక్షలు రాసి సెలవులకు వెళతారు.

పాఠ్యాంశాలపై పట్టు సాధించేలా..

విద్యార్థులు గణితం, సైన్సు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టుల్లో పట్లు సాధించేలా బ్రిడ్జి కోర్సు సిలబస్‌ రూపొందించడం జరిగింది. గణితం, సైన్సు, ఆంగ్ల పాఠ్యాంశాల్లో విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. బ్రిడ్జి కోర్సుల నిర్వహణతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. బ్రిడ్జి కోర్సు కారణంగా పదో తరగతి సిలబస్‌ను డిసెంబరు నాటికి పూర్తి చేస్తారు. జనవరి నుంచి మార్చి వరకు పునఃశ్చరణ తగతులు తగిన సమయం ఉంటుంది.

బ్రిడ్జి కోర్సు చాలా ఉపయోగకరం

కిల్లో విజిత, జడ్పీ ఉన్నత పాఠశాల, చింతపల్లి

పదో తరగతి పాఠ్యాంశాల బోధన ముందుగానే ప్రారంభించడం చాలా ఉపయోగకరంగా ఉంది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు ఏ విధంగా సిద్ధపడాలి, సిలబస్‌ ఏ విధంగా ఉంటుందో ఉపాధ్యాయులు వివరించారు. గణితం, సైన్సు, ఆంగ్లం, హిందీ పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. సందేహాలను వెంటనే నివృత్తి చేస్తున్నారు. బ్రిడ్జి కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంది.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

గిడ్డి వరలక్ష్మి, హెచ్‌ఎం, జడ్పీ హైస్కూల్‌, చింతపల్లి

తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నాం. ప్రధానంగా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సిలబస్‌ను ముందుగా ప్రారంభించడం వల్ల పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. బ్రిడ్జి కోర్సుకి విద్యార్థులందరూ హాజరవుతున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 01:11 AM