పోర్టులో విహారం
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:35 AM
విశాఖపట్నం పోర్టు క్రూయిజ్ టెర్మినల్ సమీపాన నూతనంగా నిర్మించిన ప్రొమెనేడ్ (విహారబాట/నడకబాట)ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖల మంత్రి శర్బానంద సోనోవాల్ బుధవారం విశాఖ ప్రజలకు అంకితం చేశారు. పోర్టుకు వచ్చే నౌకల రాకపోకలు ప్రజలు వీక్షించేందుకు వీలుగా పార్కు తరహాలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో 710 మీటర్ల పొడవున రూ.19 కోట్లతో ప్రొమెనేడ్‌ను ఇటీవల పోర్టు నిర్మించిన సంగతి తెలిసిందే. దీనిని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. గురువారం నుంచి ప్రజలను అనుమతించనున్నారు.
ప్రొమెనేడ్‌ను విశాఖ ప్రజలకు అంకితం చేసిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్
నౌకల రాకపోకలు వీక్షించేందుకు వీలుగా పార్కు తరహాలో నిర్మాణం
మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన
పీపీపీలో 5 బెర్తుల నిర్వహణ
అదనంగా 11 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం
విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం పోర్టు క్రూయిజ్ టెర్మినల్ సమీపాన నూతనంగా నిర్మించిన ప్రొమెనేడ్ (విహారబాట/నడకబాట)ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖల మంత్రి శర్బానంద సోనోవాల్ బుధవారం విశాఖ ప్రజలకు అంకితం చేశారు. పోర్టుకు వచ్చే నౌకల రాకపోకలు ప్రజలు వీక్షించేందుకు వీలుగా పార్కు తరహాలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో 710 మీటర్ల పొడవున రూ.19 కోట్లతో ప్రొమెనేడ్‌ను ఇటీవల పోర్టు నిర్మించిన సంగతి తెలిసిందే. దీనిని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. గురువారం నుంచి ప్రజలను అనుమతించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ప్రస్తుతం పోర్టులో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం సామర్థ్యాన్ని 10 ఎంఎల్‌డీ నుంచి 15 ఎంఎల్‌డీకి పెంచే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.11.86 కోట్లు. దీనిని 11 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అలాగే పోర్టులో సరకు రవాణా సామర్థ్యం మరో 11 మిలియన్ టన్నులు పెంచేందుకు వీలుగా ఐదు బెర్తులను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనులకు శ్రీకారం చుట్టారు. వీటి కోసం ప్రైవేటు సంస్థలు రూ.550 కోట్లు పెట్టుబడి పెడతాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం ఏపీ ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతున్నదని, విశాఖ పోర్టు ప్రపంచంలో 20వ స్థానంలో ఉందన్నారు. మోదీ హయాంలో పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, డిప్యూటీ చైర్మన్ రోష్ని అపరంజి కొరటి, సీవీఓ అరుణ్ ప్రసాద్, సెక్రటరీ శంకర్‌బాబు పాల్గొన్నారు.