Share News

జెట్టీపై జగడం

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:11 AM

‘గంగవరం’ పేరు వినగానే పోర్టు నిర్మాణంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులే గుర్తుకొస్తారు.

జెట్టీపై జగడం

గంగవరంలో నిర్మిస్తామని పోర్టు నిర్మాణ సమయంలో మత్స్యకారులకు హామీ

ఇరవై ఏళ్లయినా కార్యరూపం దాల్చని వైనం

ఇప్పుడు యారాడ వద్ద నిర్మాణానికి ప్రతిపాదనలు

వ్యతిరేకిస్తున్న ఆ గ్రామస్థులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘గంగవరం’ పేరు వినగానే పోర్టు నిర్మాణంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులే గుర్తుకొస్తారు. తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన గ్రామస్థులు కళ్ల ముందు కదలాడుతారు. అయితే పోర్టు నిర్మాణం పూర్తిచేసి పదిహేనేళ్లయినా వారికి ఇచ్చిన హామీ ప్రకారం చేపల వేటకు అవసరమైన జెట్టీని నిర్మించలేదు. అక్కడ...ఇక్కడ అంటూ కాలం గడిపేశారు. ఇప్పుడు యారాడలో నిర్మిస్తామని చెబుతున్నారు. దీనిని అక్కడ గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యారాడను పర్యాటక ప్రాంతంగా ఉంచుతారా?, చేపల విక్రయ కేంద్రంగా మారుస్తారా?...అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో అక్కడ చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న దిబ్బపాలెం, గంగవరం తదితర గ్రామాల మత్స్యకారులకు ఒక జెట్టీ నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. గంగవరం పోర్టుకు ఎగువన ‘మల్ల మారెమ్మ పటాలు’ వద్ద జెట్టీ కడతామని అప్పటి పాలకులు హామీ ఇచ్చారు. తరువాత వైసీపీ హయాంలో గంగవరం పోర్టు చేతులు మారింది. పాత యాజమాన్యం నుంచి అదానీ గ్రూపు హస్తగతం చేసుకుంది. అక్కడి నుంచి వారు ఆడిందే ఆటగా సాగుతోంది. పోర్టు సరిహద్దులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పోర్టులో ఉపాధి కల్పించిన మత్స్యకారులను సైతం పూర్తి సెటిల్‌మెంట్‌ చేసి బయటకు పంపించేసింది. ఇప్పటివరకు మత్స్యకారులకు అవసరమైన జెట్టీని నిర్మించలేదు. దాంతో వారంతా తెల్లవారక ముందే ఆటోలు పట్టుకొని విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకుంటున్నారు. అక్కడ ఇంజన్‌ బోట్లతో సముద్రంలో చేపలవేటకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఇలా 60 నుంచి 70 మంది అదే వృత్తిలో కొనసాగుతున్నారు. రోజూ విశాఖపట్నం వెళ్లి రావడం కష్టంగా ఉందని, హామీ ఇచ్చిన జెట్టీని నిర్మిస్తే స్థానికంగానే చేపలవేట సాగిస్తామని వారు స్థానిక ప్రజాప్రతినిధులను చాలా కాలంగా కోరుతున్నారు.

పదేళ్ల క్రితం అప్పికొండ ఎంపిక

గంగవరం పోర్టు ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తోంది. భవిష్యత్తు అవసరాల కోసం పోర్టును మరింత విస్తరించాలనేది వారి ఆలోచన. అందుకని పోర్టుకు సమీపంలో మత్స్యకారుల జెట్టీ నిర్మాణానికి వారు సుముఖత చూపలేదు. దాంతో దానిని యారాడ వరకు జరుపుకొంటూ వచ్చారు. యారాడలో నిర్మిస్తే తాము కూడా సహకరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దాంతో పదేళ్ల క్రితం యారాడలో ఫిషింగ్‌ జెట్టీ నిర్మించాలని ప్రతిపాదించారు. దానిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. యారాడలో ఒక్క మత్స్యకారుడూ లేడని, అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, జెట్టీ నిర్మిస్తే గ్రామంలోకి వరద పోటెత్తుందని ఆందోళన చేశారు. దాంతో వెనక్కి తగ్గారు. మండలి బుద్ధప్రసాద్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు అసెంబ్లీ పిటిషన్ల కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. అప్పుడు గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావే ఉన్నారు. 2015 అక్టోబరులో వారు ఈ ప్రాంతాన్ని సందర్శించి, యారాడ జెట్టీ నిర్మాణానికి సాంకేతికంగా సానుకూలం కాదని, అప్పికొండలో సాగరమాల ప్రాజెక్టు కింద నిర్మించాలని నివేదించారు.

మారిన ప్లాన్‌

జెట్టీ నిర్మించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించిన మల్ల మారెమ్మ పటాలు, అప్పికొండ రెండూ పోయి ఇప్పుడు యారాడలోనే ఫిషింగ్‌ జెట్టీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వారం క్రితం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీ మేరీటైమ్‌ బోర్డు, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులతో పాటు గంగవరం మత్స్యకారులను కూడా తీసుకువెళ్లి యారాడలో పర్యటించారు. యారాడలో సముద్రతీరాన మత్స్యకారుల బోట్లు నిలుపుకోవడానికి వీలుగా సముద్రంలో ‘బ్రేక్‌ వాటర్స్‌’ (అలల తాకిడి లేకుండా రాళ్లతో గట్టు) నిర్మిస్తామని, ఆ తరువాత చేపల ల్యాండింగ్‌కు అవసరమైన జెట్టీ నిర్మిస్తామని ప్రకటించారు. దీనికి అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌)ను జాప్యం లేకుండా తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

యారాడలో ఆందోళన

ఎమ్మెల్యే అధికారులను తీసుకొచ్చి, యారాడలోనే జెట్టీ నిర్మిస్తామని ప్రకటించడంతో యారాడ గ్రామస్థులు ఆదివారం గ్రామంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. తమ గ్రామంలో మత్స్యకార కుటుంబాలే లేవని, ఎక్కడి వారికో ఇక్కడ జెట్టీ నిర్మించడం తగదని వ్యతిరేకించారు. జెట్టీ, బ్రేక్‌ వాటర్స్‌ నిర్మాణం వల్ల తమ వ్యవసాయం పోతుందని, ఉప్పునీరు వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. యారాడకు పర్యాటక ప్రాంతంగా పేరుందని, దానిని ఆ విధంగానే కొనసాగేలా పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 14 , 2026 | 01:11 AM