హౌసింగ్‌కు గట్టి పునాది!
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:08 PM
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సర్కారు నిర్ణయం
మండలానికి ఒకరు చొప్పున ఇంజనీర్ల కేటాయింపు
హౌసింగ్ కార్పొరేషన్‌లో సిబ్బంది కొరత దృష్ట్యా చర్యలు
ఇకపై వేగం పుంజుకోనున్న గృహ నిర్మాణాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి మండలానికి ఒకరు చొప్పున ఇంజనీర్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నిషాంతి ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి జిల్లాలోని పదకొండు మండలాలకు జిల్లా కేంద్రంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ), పాడేరు, అరకులోయలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)లు, మండలానికి ఒకరు చొప్పున అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ)లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. అంటే జిల్లాలో ఒక ఈఈ, ఇద్దరు డీఈఈలు, పదకొండు మంది ఇంజనీర్లు, పదకొండు మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు కలిసి మొత్తం 25 మంది ఫీల్డ్ స్టాప్ ఉండాలి. కానీ జిల్లాలో ఒక ఈఈ, ఇద్దరు ఏఈఈలు, 11 మంది అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు.
చాలా ఏళ్లుగా పని భారం
హౌసింగ్ కార్పొరేషన్‌లో చాలా ఏళ్లుగా పోస్టులు భర్తీ కాక, అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడంలో ఉన్న సిబ్బందిపై తీవ్రమైన పని భారం పడుతోంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 1,028 గ్రామాల్లో పీఎం జన్‌మన్ పథకంలో 28,691 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. దీంతో ఆయా ఇళ్ల నిర్మాణ స్థితిగతులపై ఎం.బుక్ రికార్డింగ్, జియో ట్యాగింగ్ చేసి బిల్లులు పెట్టడం వంటి పనులు చేయాలి. ఈ క్రమంలో సిబ్బందికి అదనపు భారంగా ఉంటోంది. అయినప్పటికీ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం ఉన్న సిబ్బంది అవసరమైన పనులను రేయింబవళ్లు చేస్తూ జిల్లాలోని పీఎం జన్‌మన్ పథకంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే రానున్న మూడేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశయానికి అనుగుణంగా ఇళ్లు లేని పేదలను గుర్తించారు. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం లక్షా 98 వేల 104 కుటుంబాలు కాగా, వారిలో ఇప్పటికే వివిధ పథకాల్లో మొత్తం లక్షా 38 వేల 695 కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యాయి. ఇంకా 59 వేల 409 కుటుంబాలకు ఎటువంటి ఇళ్లు లేవని గుర్తించారు. వారందరికీ రానున్న మూడేళ్లలో అంటే 2029 నాటికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాల సేకరణ, జియోట్యాగింగ్, స్థలాల పరిశీలన ప్రక్రియలను చేపట్టేందుకు హౌసింగ్ అధికారులు, సిబ్బంది ఎంతగానో శ్రమించారు.
జిల్లాకు 12 మంది ఇంజనీర్లు కేటాయింపు
హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇంజనీర్ల కొరతను జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో 12 మంది ఇంజనీర్లను కేటాయించారు. సచివాలయాల్లో ఉన్న 12 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లను హౌసింగ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మొత్తం 12 మందిలో ఒకరు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో, మిగిలిన 11 మంది మండలానికి ఒకరు చొప్పున నియమిస్తూ కలెక్టర్ టి.నిషాంతి ఉత్తర్వులు జారీ చేశారు. చాలా ఏళ్లుగా సిబ్బంది కొరతలో ఇబ్బందులు పడుతున్న హౌసింగ్ కార్పొరేషన్‌కు తాజా నియామకాలతో బలం చేకూరిందని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇకపై జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతమవుతాయని హౌసింగ్ సిబ్బంది, లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.