ఘనంగా మునిసిపల్ పాలకవర్గానికి వీడ్కోలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:56 PM
ఎలమంచిలి మునిసిపాలిటీ రెండవ పాలకవర్గం వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
52 వంటకాలతో పసందైన విందు
పాలకవర్గసభ్యులు, అధికారులు ఇళ్ల నుంచి తయారు చేయించి తీసుకు వచ్చిన వైనం
ఎలమంచిలి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీ రెండవ పాలకవర్గం వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్ రమాకుమారి ఆధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ ప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మునిసిపల్ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ఈ నెల 17వ తేదీతో ముగియనుండడంతో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకవర్గ సభ్యులతో పాటు కమిషనర్ ప్రసాదరాజు, అధికారులు చైర్‌పర్సన్ రమాకుమారిని ఘనంగా సత్కరించారు. అదే విధంగా కౌన్సిలర్లను అధికారులు సన్మానించారు. పాలకవర్గమంతా సమష్టిగా మునిసిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించారని చైర్‌పర్సన్ కొనియాడారు.
52 వంటకాలతో విందు ఏర్పాటు
మునిసిపల్ పాలకవర్గం వీడ్కోలు కార్యక్రమానికి ప్రత్యేక సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో విందుకు అవసరమైన వంటకాలన్నీ ప్రతి కౌన్సిలర్, అధికారులు తమ ఇంటి వద్ద తయారు చేయించి తీసుకువచ్చారు. ఇలా సుమారు 52 రకాలతో ఈ విందు ఏర్పాటు చేశారు. మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు గిరిజన సంప్రదాయ వంటకాలు పులగం, అంబలి తయారు చేయించి తీసుకువచ్చారు. ఈ వంటకాలన్నీ రుచికరంగా ఉన్నాయని పాలకవర్గ ప్రతినిధులు, అధికారులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం పాలకవర్గ సభ్యులు గ్రూపు ఫొటోలు దిగారు.