మన్యంలో ముసురు
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:28 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మన్యంలో శుక్రవారం ముసురు వాతావరణం కొనసాగింది.
పాడేరులో జల్లులు
పలు మండలాల్లో భారీ వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం
కోతకు గురైన పెదబయలు మండలం లుగసరిపుట్టు రోడ్డు
అయినా తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు
కొయ్యూరులో 31.6 డిగ్రీలు
పాడేరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మన్యంలో శుక్రవారం ముసురు వాతావరణం కొనసాగింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైన జల్లులతో కూడిన వర్షం కురవగా పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొయ్యూరులో శుక్రవారం 31.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా జీకేవీధిలో 28.0, అరకులోయలో 26.9, అనంతగిరిలో 26.8, చింతపల్లిలో 26.5, డుంబ్రిగుడలో 25.5, పాడేరులో 24.6, ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేటలో 24.2, జి.మాడుగులలో 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో
మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం పడుతునే ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో మత్స్యగెడ్డ పాయలు, వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. మట్టి రహదారులు బురదమయంగా మారడంతో రాకపోకలకు గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు. డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి.
హుకుంపేటలో..
మండలంలో శుక్రవారం రోజంతా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం విడకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వరి పంటకు అనుకూలమని గిరి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కామయ్యపేట, హుకుంపేట ప్రధాన రోడ్లపై గల గుంతల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు చేసేందుకు వాహన చోదకులు అవస్థలు పడ్డారు. పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేసేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
పెదబయలులో
పెదబయలు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి 1 గంట నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. అనంతరం ముసురు వాతావరణం కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుంతుర్ల పంచాయతీ పరిధిలోని లుగసరిపుట్టు ప్రధాన రహదారి భారీ వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల నిర్మించిన ఈ రహదారి వరద నీటి ఉధృతికి పలు చోట్ల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడి ఛిద్రమైంది. రోడ్డు పక్కన కాలువ నిర్మించకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరి కోతకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.