Share News

మన్యంలో ముసురు

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:23 PM

మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. వాస్తవానికి శనివారం నుంచే వాయుగుండం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై పొగమంచు కురవలేదు.

మన్యంలో ముసురు
జి.మాడుగులలో జల్లులు కురుస్తున్న దృశ్యం

అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షం

అయినా తగ్గని చలి ప్రభావం

పాడేరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. వాస్తవానికి శనివారం నుంచే వాయుగుండం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై పొగమంచు కురవలేదు. అయినప్పటికీ చలి ప్రభావం పెద్దగా తగ్గలేదు. దీంతో ఏజెన్సీలో జనం వణుకుతున్నారు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం సింగిల్‌ డిజిట్‌ నుంచి డబుల్‌ డిజిట్‌కు చేరాయి. దీంతో ఆదివారం జి.మాడుగులలో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, పెదబయలులో 12.9, ముంచంగిపుట్టులో 13.0, చింతపల్లిలో 13.2, అరకులోయలో 13.5, హుకుంపేటలో 14.0, కొయ్యూరులో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో..

అరకులోయ: అరకులోయలో వేకువజాము మొదలు ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. చలి నుంచి ఉపశమనం పొందడానికి వీధుల్లో చలిమంటలు వేసుకున్నారు.

అనంతగిరిలో..

అనంతగిరి: మండలంలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం, రాత్రి తేడా లేకుండా చలి గాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే చలికి జనం వణికిపోయారు. కాగా ఉదయం 11 గంటలకు చిరు జల్లులు కురిశాయి. కొంత సేపటికి వర్షం ఆగిపోయింది. జనం ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతూ సేద తీరారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం ఉదయం పలు చోట్ల వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బలంగా చలిగాలులు వీయడంతో జనం వణికిపోయారు. నిత్యం రద్దీగా ఉండే స్థానిక ప్రధాన రహదారిపై జన సంచారం తగ్గుముఖం పట్టింది.

జి.మాడుగులలో...

జి.మాడుగుల: మండలంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురిశాయి. వాతావరణంలో మార్పు కారణంగా జనం అసౌకర్యానికి గురయ్యారు.

చింతపల్లిలో...

చింతపల్లి: మండలంలో చిరుజల్లులు కురిశాయి. అల్పపీడన ప్రభావం వలన శనివారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమై వుంది. రోజంతా ముసురు వాతావరణం నెలకొంది.

Updated Date - Jan 11 , 2026 | 11:23 PM