Share News

హెల్త్‌ అసిస్టెంట్లకు ఊపిరి

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:36 AM

సుమారు రెండున్నర దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)కు కూటమి ప్రభుత్వం ఊరట ఇచ్చింది.

హెల్త్‌ అసిస్టెంట్లకు ఊపిరి

14 నెలల తరువాత తిరిగి విధుల్లోకి తీసుకొన్న ప్రభుత్వం

2003లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీహెచ్‌ఏల నియామకం

కొంతకాలం తరువాత పదోన్నతుల విషయంలో వివాదం

తక్కువ మెరిట్‌ ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు

2024 డిసెంబరులో ఉమ్మడి జిల్లాలో 128 మంది తొలగింపు

ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి

మానవతా దృక్పథంతో సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయం

చోడవరం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

సుమారు రెండున్నర దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)కు కూటమి ప్రభుత్వం ఊరట ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్రవాప్తంగా 2024 డిసెంబరులో తొలగింపునకు గురైన 1,200 మందిని మానవతా దృక్పఽథంతో తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఆయా ఎంపీహెచ్‌ఏలను విధుల్లో చేర్చుకొంటూ వైద్య, ఆరోగ్య అధికారులు నియామక ఉత్తర్వులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 128 మంది ఎంపీహెచ్‌ఏలకు మేలు చేకూరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003వ సంవత్సరంలో నియమితులైన మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో తలెత్తిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. తక్కువ మెరిట్‌ ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, ఎక్కువ మెరిట్‌ ఉన్నవారినే కొనసాగించాలని సుమారు 14 నెలల క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో 2024 డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 ఎంపీహెచ్‌ఏను విధుల నుంచి తొలగించారు. రెండు దశాబ్దాల పైబడి ఉద్యోగం చేస్తున్న వీరి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా 50 ఏళ్లు పైబడి ఉండడంతో కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న కూటమి ప్రభుత్వం.. సుప్రీం కోర్టు తీర్పుతో తొలగింపునకు గురైన ఎంపీహెచ్‌ఏల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వీరు ఎంతోకాలంగా ఉద్యోగాలు చేస్తున్నందున, మానవతా దృక్పఽథంతో ఉద్యోగాల్లో కొనసాగించేందుకు తమకు అభ్యంతరం లేదంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎంపీహెచ్‌ఏలను కొనసాగించేందుకు అంగీకరిస్తూ, గత ఏడాది అక్టోబరులో ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల క్రితం జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు, గతంలో తొలగింపునకు గురైన ఎంపీహెచ్‌ఏను తిరిగి విధుల్లోకి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆయా హెల్త్‌ అసిస్టెంట్లకు తిరిగి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 128 మంది ఎంపీహెచ్‌ఏ సుమారు 14 నెలల తరువాత తిరిగి విధుల్లో చేరుతున్నారు.

సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాం

బి.ఎలీషారావు, ఎంపీహెచ్‌ఏల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌

మా ఉద్యోగాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడంతోపాటు, మాకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి, మా జీవితాలు నిలబెట్టిన సీఎం చంద్రబాబుకు హెల్త్‌ అసిస్టెంట్ల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాం. 2003 నుంచి పనిచేస్తున్న మాలో అందరూ 50 సంవత్సరాల పైబడి ఉన్నవారే. ఈ వయస్సులో వేరే ఉద్యోగం పొందే అవకాశం లేని సమయంలో మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

మా జీవితాలను నిలబెట్టారు

కె.జగన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, చోడవరం

సుప్రీం కోర్టు తీర్పు తదనంతర పరిణామాలతో మాకు తిరిగి ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు కోల్పోయాం. సుమారు రెండు దశాబ్దాల పైబడి పనిచేస్తూ వచ్చిన మేము ఒక్కసారిగా ఉద్యోగాలు పోవడంతో 14 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి మా జీవితాలను నిలబెట్టింది.

పునర్నియామక ఉత్తర్వులు అందించిన డీఎంహెచ్‌వో

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 128 మంది హెల్త్‌ అసిస్టెంట్లకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు సోమవారం సాయంత్రం నియామక ఉత్తర్వులను అందించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 2024 డిసెంబరులో ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగించింది. అయితే ఇరవై ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న తాము అర్ధంతరంగా వీధినపడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, సుప్రీంకోర్టులో సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అక్కడి నుంచి సానుకూల స్పందన రావడంతో వీరికి తిరిగి నియామక ఉత్వర్వులను అందించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నియామక పత్రాలను అందించినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జగదీశ్వరరావు వెల్లడించారు.

Updated Date - Feb 03 , 2026 | 01:36 AM