Share News

హెల్త్‌ అసిస్టెంట్లకు ఊపిరి

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:24 AM

సుమారు రెండున్నర దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)కు కూటమి ప్రభుత్వం ఊరట ఇచ్చింది.

హెల్త్‌ అసిస్టెంట్లకు ఊపిరి

2003లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీహెచ్‌ఏల నియామకం

కొంతకాలం తరువాత పదోన్నతుల విషయంలో వివాదం

తక్కువ మెరిట్‌ ఉన్న వారిని తొలగించాలని సుప్రీకోర్టు ఉత్తర్వులు

ఆ మేరకు 2024లో ఉమ్మడి జిల్లాలో 128 మంది తొలగింపు

మానవతా దృక్పథంతో తిరిగి తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం

విశాఖపట్నం/చోడవరం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

సుమారు రెండున్నర దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏ)కు కూటమి ప్రభుత్వం ఊరట ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రవాప్తంగా 2024 డిసెంబరులో తొలగింపునకు గురైన 1,200 మందిని మానవతా దృక్పఽథంతో తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఎంపీహెచ్‌ఏలను విధుల్లో చేర్చుకొంటూ వైద్య, ఆరోగ్య అధికారులు నియామక ఉత్తర్వులు ఇస్తున్నారు. సీఎం నిర్ణయంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో 128 మంది ఎంపీహెచ్‌ఏలకు మేలు చేకూరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో నియమితులైన మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో తలెత్తిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం..తక్కువ మెరిట్‌ ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, ఎక్కువ మెరిట్‌ ఉన్నవారినే కొనసాగించాలని సుమారు 14 నెలల క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో 2024 డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 ఎంపీహెచ్‌ఏను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారు కావడంతో కుటుంబ పోషణ కష్టమైంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న కూటమి ప్రభుత్వం..సుప్రీంకోర్టు తీర్పుతో తొలగింపునకు గురైన ఎంపీహెచ్‌ఏల విషయంలో సానుకూలంగా స్పందించింది. వారు ఎంతోకాలంగా ఉద్యోగాలు చేస్తున్నందున, మానవతా దృక్పథంతో ఉద్యోగాల్లో కొనసాగించేందుకు తమకు అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం..ఎంపీహెచ్‌ఏలను కొనసాగించేందుకు అంగీకరిస్తూ, గత ఏడాది అక్టోబరులో ఉత్తర్వులు జారీచేసింది. వారం క్రితం జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబునాయుడు, గతంలో తొలగింపునకు గురైన ఎంపీహెచ్‌ఏను తిరిగి విధుల్లోకి ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆయా హెల్త్‌ అసిస్టెంట్లకు తిరిగి నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో 128 మంది ఎంపీహెచ్‌ఏ సుమారు 14 నెలల తరువాత తిరిగి విధుల్లో చేరుతున్నారు.

సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాం

బి.ఎలీషారావు, ఎంపీహెచ్‌ఏల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌

మాకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి, జీవితాలు నిలబెట్టిన సీఎం చంద్రబాబునాయుడుకు హెల్త్‌ అసిస్టెంట్ల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాం. 2003 నుంచి పనిచేస్తున్న మాలో అందరూ 50 సంవత్సరాల పైబడి ఉన్నవారే. ఈ వయస్సులో వేరే ఉద్యోగం పొందే అవకాశం లేని సమయంలో మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.

Updated Date - Feb 03 , 2026 | 01:24 AM