Share News

మారుమూల గ్రామాల జల్లెడ

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:11 AM

మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆపరేషన్‌ కగార్‌లో నిర్దేశించిన లక్ష్యం రమారమి పూర్తి కావడంతో ఇప్పడు మన్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్‌ వజ్రపహార్‌తో పోలీసులు ముందుకు సాగుతున్నారు.

మారుమూల గ్రామాల జల్లెడ
ఆపరేషన్‌ వజ్రపహార్‌లో భాగంగా బూదరాళ్ల పంచాయతీ గరిమండలోని ఒక ఇంటిని తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్‌ ఫొటో)

- విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, పోలీసు బలగాలు

- ఆపరేషన్‌ కగార్‌ లక్ష్యం దాదాపు పూర్తి కావడంతో వజ్రపహార్‌పై దృష్టి

- శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనే లక్ష్యం

కొయ్యూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆపరేషన్‌ కగార్‌లో నిర్దేశించిన లక్ష్యం రమారమి పూర్తి కావడంతో ఇప్పడు మన్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్‌ వజ్రపహార్‌తో పోలీసులు ముందుకు సాగుతున్నారు.

సుదీర్ఘ చరిత్ర గల మావోయిస్టు ఉద్యమం ఆపరేషన్‌ కగార్‌తో పూర్తిగా దెబ్బతింది. అల్లూరి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మావోయిస్టుల సంఖ్య ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. హిడ్మా వంటి చాలా మంది అగ్ర నేతలు ఎదురు కాల్పుల్లో మరణించగా, దేవ్‌జీతో పాటు మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. ఇంకా ముప్పాల కేశవరావు అలియాస్‌ గణపతి వంటి అగ్రనేత ఆచూకీ తెలియకపోగా, మిసిల్‌బెస్రా అలియాస్‌ సునీల్‌ అజ్ఞాతంలో ఉన్నారు. ఆపరేషన్‌ కగార్‌ ఫలితంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 60 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని అధికారిక అంచనా. వీరిలో ముఖ్యులు గణపతి, సునీల్‌. కగార్‌ అనంతరం నేతల మధ్య కమ్యూనికేషన్‌ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో గణపతి ఆచూకీపై స్పష్టత లేదు. ఇక సునీల్‌ అజ్ఞాతంలోనే ఉంటూ ఉద్యమాన్ని నడిపించే యోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నాడనే సమాచారం మేరకు ఆయనతో పాటు మిగిలిన మావోయిస్టుల కోసం 15 వేల మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ బలగాలతో అడవిలో జల్లెడ పడుతున్నట్టు సమాచారం. కాగా శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన ధ్యేయంగా ఆపరేషన్‌ వజ్రపహార్‌కు పోలీసులు శ్రీకారం చుట్టారు. నేరస్థులను ముందుగానే గుర్తించడం, నేరం జరగకుండా చేయడం వజ్రపహార్‌ ప్రధాన ఉద్దేశం. గత 20 రోజులుగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ వజ్రపహార్‌ అమలులోకి తెచ్చారు. జిల్లా సరిహద్దు ఒడిశా నుంచి గంజాయి రవాణా పోలీసులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు మారుమూల కొండలపై ఉన్న గ్రామాల్లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము, అర్ధరాత్రి సమయాల్లో పోలీసులు ఒకేసారి గ్రామం నలువైపుల చుట్టుముట్టి తనిఖీలు చేస్తున్నారు. బయట వ్యక్తులు ఆ సమయంలో గ్రామంలో ఉంటే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రికార్డులు లేని వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నేరాలు చేయాలనుకునేవారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారు భయపడుతున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 01:11 AM