డీసీసీబీకి కనక వర్షం
ABN , Publish Date - May 31 , 2026 | 12:49 AM
బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరుచేయడం ద్వారా విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)కు మంచి ఆదాయం సమకూరుతుంది.
బంగారంపై రుణాల మంజూరులో భారీ వృద్ధి
ఐదేళ్లలో రూ.100 కోట్ల నుంచి రూ.572 కోట్లకు...
రాష్ట్రంలో మూడో స్థానం
ఆర్థిక సంవత్సరాంతానికి రూ.700 కోట్లకు చేరుకుంటుందంటున్న సీఈవో
తొమ్మిది శాతం వడ్డీతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు మంచి ఆదాయం
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరుచేయడం ద్వారా విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)కు మంచి ఆదాయం సమకూరుతుంది. తొమ్మిది శాతం వడ్డీకి బంగారు ఆభరణాలపై డీసీసీబీ రుణాలు అందిస్తోంది. ప్రస్తుతం విశాఖ డీసీసీబీ బ్రాంచీల్లో బంగారు ఆభరణాలపై రూ.572 కోట్ల వరకూ రుణాలు అందజేశారు. బ్యాంకు చరిత్రలో ఇదో రికార్డుగా అధికారులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలపై రుణాల మంజూరులో రాష్ట్రంలో కృష్ణా డీసీసీబీ (రూ.1,200 కోట్లు), గుంటూరు డీసీసీబీ (రూ.900 కోట్లు) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండగా విశాఖ డీసీసీబీ రూ.572 కోట్లతో మూడోస్థానంలో ఉంది.
భూములు, ఇళ్లపై రుణాలు మంజూరులో అనేక ఇబ్బందులు ఉన్నందున అత్యధికులు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో కుదవబెట్టి రుణాలు పొందుతున్నారు. సహకార బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ మంజూరుపై ఎక్కువగా దృష్టిసారించాయి. 2020లో డీసీసీబీలోని అన్ని బ్రాంచిలలో బంగారు ఆభరణాలపై రూ. 100 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం ఆ మొత్తం రూ.572 కోట్లకు చేరింది.
ఉమ్మడి జిల్లాలో డీసీసీబీకి 33 బ్రాంచీలు ఉండగా నగరంలో 16 ఉన్నాయి. బంగారు ఆభరణాలపై నగరంలోని 16 బ్రాంచీలు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్లు రుణాలుగా ఇచ్చాయి. శ్రీహరిపురం బ్రాంచి అత్యధికంగా రూ.50 కోట్లు మంజూరుచేసింది. ఆభరణాలపైఇటీవల వరకూ మార్కెట్ రేటులో 75 శాతం రుణం ఇచ్చేవారు. ప్రస్తుతం 65 శాతానికి తగ్గించారు. ఉదాహరణకు రూ.10 వేల విలువైన బంగారానికి రూ.6,500 రుణం ఇస్తున్నారు. బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నవారు ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. లేనిపక్షంలో నోటీసు జారీచేస్తారు. మూడు నోటీసులు తరువాత ఆభరణాలు వేలం వేస్తారు. అయితే బంగారం ధర పెరిగినందున రుణాలు తీసుకున్న వారంతా ఏడాదిలోగా వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. దీనివల్ల డీసీసీబీ ఆదాయం గణనీయంగా పెరిగింది. బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు గురించి డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో ఇంతవరకు రూ.572 కోట్లు ఇచ్చామన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అంటే 2027 మార్చి నెలాఖరుకు ఈ మొత్తం రూ.700 కోట్లకు పెంచుతామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి విలువ పెరగడంతో సొంత అవసరాల కోసం ఎక్కువమంది ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్నారన్నారు. ఏడాదిలోగా రుణం చెల్లించి ఆభరణాలు విడిపించుకుంటున్నారని, వేలం వరకూ వెళ్లిన ఉదంతాలు గడచిన ఐదారేళ్లలో లేవన్నారు. ఆభరణాలపై రుణాల మంజూరు ద్వారా బ్యాంకుకు ఆదాయం పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4 కోట్ల నికర ఆదాయం రాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.6 కోట్లు రావచ్చని ఆయన తెలిపారు.