Share News

పరామర్శ పేరుతో బల ప్రదర్శన!

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:46 AM

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నగర పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నానా హడావిడి చేశారు.

పరామర్శ పేరుతో బల ప్రదర్శన!

బాధలో ఉన్న వారిని పక్కనపెట్టుకుని వైసీపీ అధినేత రాజకీయ ప్రసంగం

సీఎం...సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు

దారిపొడవునా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీల ఏర్పాటు

పోలీసులతో నేతల వాగ్వాదం

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నగర పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నానా హడావిడి చేశారు. చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం 12.30 గంటలకు వన్‌టౌన్‌ జబ్బర్‌తోటలోని బాధితుల ఇళ్ల వద్దకు చేరుకున్నారు. అయితే జగన్‌ ఏదో రాజకీయ సభలో పాల్గొనేందుకో, ఎన్నికల ప్రచారం కోసమో వస్తున్నారన్నట్టు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశీల్‌మెట్ట జంక్షన్‌ నుంచి జగదాంబ జంక్షన్‌, పూర్ణామార్కెట్‌ జంక్షన్‌, ఏవీఎన్‌ కాలేజీ డౌన్‌, జబ్బర్‌తోట వరకు దారిపొడవునా వైసీపీ జెండాలు, ఏఐతో తయారుచేసిన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఏవీఎన్‌ కాలేజీ డౌన్‌ నుంచి జబ్బర్‌తోటలోని బాధితుల నివాసాల వరకు జగన్‌ కారు బయటకు వచ్చి రెండు చేతులతో అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కండువాలు వేసుకుని జగన్‌ను కీర్తిస్తూ నినాదాలు చేయడం...సీఎం...సీఎం అంటూ అరవడం చేస్తున్నా ఆయన వారిని వారించకపోవడం విశేషం. తీవ్రమైన శోకంలో ఉన్న ఆరు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చామన్న స్పృహ కూడా లేకుండా వారిని మరింత ఉత్సాహపరిచేలా నవ్వుతూ అభివాదం చేయడం కనిపించింది. అదేవిధంగా బాధిత కుటుంబాలకు చెందినవారు తన పక్కనే ఉన్నారనే విషయాన్ని మరిచిపోయి జగన్‌ రాజకీయాలు గురించి మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొందరు సీఎం...సీఎం...అని అరుస్తుంటే పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ఒకరు మరింత గట్టిగా అరవాలంటూ చేతులతో సైగలు చేశారు. జబ్బర్‌తోటలోని బాధితుల ఇళ్ల వైపు వైసీపీ కార్యకర్తలు వస్తే ఇరుకైన సందుల్లో కుమ్ములాట జరిగే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు ఏవీఎన్‌ కాలేజీ డౌన్‌, జబ్బర్‌తోట జంక్షన్‌, రంగిరీజు వీధి ఆర్చ్‌ వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్సతోపాటు మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదిలావుండగా జగన్‌ మీడియాతో మాట్లాడుతున్న ప్రాంతానికి సమీపంలోనే 2023 నవంబరులో గుజరాత్‌ తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన బెవర పోలారావు ఇల్లు ఉంది. ఆ సమయంలో తన భర్త చనిపోయినప్పటికీ సీఎంగా ఉన్న జగన్‌ తనకు ఎలాంటి సహాయం చేయలేదని, ఇప్పుడైనా ఏదో హామీ ఇవ్వాలంటూ పోలారావు భార్య ఐరమ్మ తన భర్త ఫొటో పట్టుకుని నిలబడినా, జగన్‌ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు.


అసలు విషయం పక్కనపెట్టి...

బోటు ప్రమాద సమాచారం

అధికారులకు అందించడంలో జాప్యం చేసిన నేతపై జగన్‌ ప్రశంసలు

సాయంత్రమే తెలిస్తే రాత్రి వరకూ ఎందుకు చెప్పలేదనే ప్రశ్నే లేదు

ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్ర

అతని కాల్‌ డేటా సేకరించి విచారణ జరపాలని మత్స్యకార సంఘాల డిమాండ్‌

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

సముద్రంలో గల్లంతైన మత్స్యకారులకు తక్షణ సాయం అందకుండా రాజకీయం చేసిన మత్స్యకార నాయకుడిని పక్కన పెట్టుకొని, అతడే అందరికీ సమాచారం ఇచ్చాడని మాజీ సీఎం జగన్‌ ప్రశంసలు కురిపించడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. బోటు గల్లంతైన సమాచారం జూలై నాలుగో తేదీన ముందుగా వైసీపీ నాయకుడికే అందింది. అధికారులకు ఆ విషయం వెంటనే చెప్పి ఉంటే తగిన సహాయక చర్యలు తీసుకొని ఉండేవారు. కానీ అలా చేస్తే పార్టీకి మైలేజీ రాదని ఉద్దేశపూర్వకంగా ఆ సమాచారం రాత్రి 10.30 గంటల వరకు తొక్కి పెట్టి...అప్పుడు అధికారులకు మొబైల్‌లో మెసేజ్‌లు పంపారని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. అప్పటికే చీకటి పడడంతో అధికారులు తెల్లవారగానే...ఐదో తేదీ ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమాచారం ముందురోజు సాయంత్రం నాలుగు గంటలకు చెబితే వెంటనే నేవీ, కోస్ట్‌గార్డు రంగంలో దిగి మత్స్యకారులను కాపాడి ఉండేవారని అంటున్నారు. జగన్‌ ఈ వాస్తవాలు మాట్లాడకుండా, సదరు నేత...ఏ అధికారికి ఎన్ని గంటలకు మెసేజ్‌ చేశాడో స్ర్కీన్‌ షాట్లు మీడియాకు చూపించి, చాలా కష్టపడ్డాడని ప్రశంసలు కురిపించారు. అసలు ఆ వ్యక్తి ఫోన్‌కు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది?...దానిని వెంటనే ఎందుకు అధికారులకు చెప్పలేదనే అంశాన్ని మరుగున పెట్టారు. వెంటనే సహాయక చర్యలు చేపడితే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆ సమాచారం తొక్కి పెట్టారని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ అంశంపై విచారణ చేసి, సదరు వైసీపీ నేత కాల్‌ లాగ్‌ తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని మత్స్యకార సంఘాలు సూచిస్తున్నాయి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా దీనిపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే అధికారులకు, సహాయక చర్యలు చేపట్టే వారికి విషయం తెలియపరచాలని వారు సూచిస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులను నమ్ముకుంటే ఒక్కోసారి వారి స్వార్థం కారణంగా ప్రాణాలకే ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - Jul 15 , 2026 | 12:46 AM