Share News

రోడ్డెక్కిన దుకాణం!

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:56 AM

నగరంలో రోడ్ల మార్జిన్లు, ఫుట్‌పాత్‌లను కొంతమంది ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు.

రోడ్డెక్కిన దుకాణం!

యథేచ్ఛగా రహదారుల ఆక్రమణ

ఫుట్‌పాత్‌లు కూడా...

కుంచించుకుపోతున్న రోడ్లు

రాకపోకలకు వాహన చోదకుల పాట్లు

పట్టించుకోని జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో రోడ్ల మార్జిన్లు, ఫుట్‌పాత్‌లను కొంతమంది ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆయా మార్గాల్లో వాహన చోదకులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. కళ్లెదుటే ఆక్రమణలు కనిపిస్తున్నా పోలీసులు, జీవీఎంసీ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరంలో జనాభాతోపాటే వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి పరిస్థితిలో కనీసం ఉన్న రోడ్లలో ఆక్రమణలకు తావులేకుండా వాహనాల రాకపోకలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చేయగలిగితే రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అయితే నగరంలో గత కొంతకాలంగా ఫుట్‌పాత్‌లపై దుకాణాలు వెలుస్తున్నాయి. దీనివల్ల పాదచారులంతా రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లతో ఆగిపోకుండా ఏకంగా రోడ్డుపైకి దుకాణాలను పొడిగించేసి బెంచీలపై విక్రయ సామగ్రిని ప్రదర్శనకు ఉంచుతున్నారు. ఇరువైపులా దుకాణాల నిర్వాహకులు అదేమాదిరిగా చేస్తుండడంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోతోంది. ఎంత విశాలమైన రోడ్డు అయినప్పటికీ కేవలం ఒక ద్విచక్ర వాహనం మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పొరపాటున మరొక ద్విచక్ర వాహనం ఎదురైనా ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోవాల్సిందే. దీనివల్ల వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎక్కడికక్కడే ఆక్రమణలు

నగర నడిబొడ్డున ఉన్న పాతజైలురోడ్డులోని ప్రభుత్వ మహిళా కళాశాల వైపు ఉన్న విశాలమైన ఫుట్‌పాత్‌ను పండ్ల దుకాణలు, కార్లు, బైక్‌ల పార్కింగ్‌లకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆ రోడ్డులో నడిచేవారికి ఫుట్‌పాత్‌లపై నుంచి రాకపోకలు సాగించే అవకాశం లేకపోవడంతో రోడ్లుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాల్ఫిన్‌హోటల్‌ జంక్షన్‌ నుంచి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లలు ఒకవైపు పాతపుస్తకాల వ్యాపారులు ఆక్రమించేస్తే...రెండో వైపు ఉన్న ఫుట్‌పాత్‌ను అటువైపు ఉన్న దుకాణదారులు ఆక్రమించేశారు. అల్లిపురం మార్కెట్‌, గాంధీవిగ్రహం ప్రాంతంలో అయితే ప్రధాన రహదారిని ఇరువైపులా ఉన్న వ్యాపారులు ఆక్రమించేశారు. తమ దుకాణం ఎదురుగా బెంచీలు పెట్టి వాటిపై తాము విక్రయించే వస్తువులను ప్రదర్శనకు పెడుతున్నారు. దీనివల్ల విశాలమైన రోడ్డు కేవలం నడకదారి మాదిరిగా కుంచించుకుపోయింది. టర్నర్‌ చౌలీ్ట్ర నుంచి పాతపోస్టాఫీస్‌ వరకు, జగదాంబ జంక్షన్‌ పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు ఉన్నప్పటికీ ఆక్రమణలు కారణంగా కనిపించకుండాపోయాయి.

చోద్యంచూస్తున్న పోలీసులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

ఫుట్‌పాత్‌లు, రహదారులను ఎవరైనా ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేసినా, వ్యాపారాలకు వినియోగిస్తున్నా ట్రాఫిక్‌ పోలీసులు, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలను తొలగించి వాహనాల రాకపోకలకు, పాదచారులు నడిచేందుకు ఇబ్బందిలేకుండా చూడాలి. కానీ కళ్లముందే ఫుట్‌పాత్‌లు, రోడ్లను వ్యాపారులు ఆక్రమించేసినా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతున్నా పోలీసులుగానీ, జీవీఎంసీ అధికారులు గానీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కు అయిపోవడం వల్లనే ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాసరే తేలిగ్గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 13 , 2026 | 12:56 AM