మెడికోల వరుస ఆత్మహత్యలు!
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:50 AM
ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మూడు నెలల్లో ముగ్గురు...
గడచిన వారంలో ఇద్దరు పీజీ విద్యార్థినులు బలవన్మరణం
ఆంధ్ర మెడికల్ కళాశాలలో కలకలం
ఒత్తిడి, టార్గెట్స్, మానసిక, వ్యక్తిగత సమస్యలు కారణం
కౌన్సెలింగ్ ఇస్తున్నామంటున్న అధికారులు
ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచన
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలోనే మానసిక సమస్యలతో బాధపడుతుండడం, తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఆత్మహత్యలకు కారణంగా మెడికల్ కళాశాల అధికారులు చెబుతున్నారు. అటువంటి ఆలోచనలను నియంత్రించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామంటున్నారు.
భిన్న అంశాలు కారణం
ఈ ఏడాది జూలైలో ఫోరెన్సిక్ విభాగానికి చెందిన పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తొలి నుంచీ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్న యువకుడు హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత జనరల్ సర్జరీ విభాగానికి చెందిన శశి అనే విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో సహచరులు గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో కోలుకున్నాడు. అతను కూడా మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇకపోతే, నాలుగు రోజుల కిందట జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన పీజీ విద్యార్థిని పి.శైలజ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసి అక్కడే పీడియాట్రిక్స్‌లో పీజీలో సీటు సంపాదించారు. అయితే, అనూహ్యంగా మనసు మార్చుకుని ఏఎంసీలో జనరల్ మెడిసిన్ విభాగంలో చేరారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో తొలి పేపర్ సరిగా రాయలేకపోయిన ఆమె తీవ్రంగా బాధపడిందని, ఆ తరువాత పేపర్లు రాయలేనన్న ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. తెలివైన అమ్మాయిగా గుర్తింపు పొందిన శైలజ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోయారు. ఇక, సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి ఈఎన్‌టీ పీజీ. తొలి నుంచీ ఆమెకు ఇంజనీరింగ్ చేయాలన్న ఆసక్తి ఉండేది. అయితే, కుటుంబ సభ్యులు ఒత్తిడి, ఇతర కారణాలతో మెడిసిన్ పూర్తి చేసి పీజీలో చేరింది. కోర్సు నుంచి వైదొలుగుతానని ఉన్నతాధికారులకు చెప్పిన ఆమె...సర్టిఫికెట్లు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీని వెనుక మరికొన్ని కారణాలు ఉన్నట్టు అధికారులు చెబుతుండగా, ఆత్మహత్య లేఖలోనే ఆమె ఇదే విషయాన్ని చెప్పారు.
ఒత్తిడితో చిత్తు..
వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన టార్గెట్స్ (చదువు విషయంలో), వ్యక్తిగత కారణాలు, రిలేషన్స్, ఆర్థిక అంశాలు వంటివి వైద్య విద్యార్థులను కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య అభ్యసిస్తున్నారంటే వారిపై కుటుంబం నుంచి విపరీతమైన అంచనాలు పెరుగుతుంటాయి.వాటిని అందుకునే క్రమంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ఈ ఒత్తిడి పరిధి దాటుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండకపోవడంతో ఈ తరహా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
31.2 శాతం మందిలో ఆలోచనలు
వైద్య విద్యనభ్యసించే వారిలో కొన్నాళ్లుగా ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, సమాజం నుంచి పెరిగిన అంచనాలు, చదువులో తీవ్రమైన ఒత్తిడి, రాత్రిపూట విధులు, అత్యవసర కేసులకు హాజరు, కేస్ షీట్లు, పరిశోధన వ్యవహారాలు, ఆపరేషన్లు, ఇతర అంశాలతో వయసుకు మించిన ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో విద్యార్థుల్లో ఎంతోమంది తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య ఆలోచనలు (31.2 శాతం మంది) చేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ నివేదిక వెల్లడించింది.
ఈ లక్షణాలను బట్టి..
విద్యార్థి యాక్టివ్‌గా లేకపోయినా, నీరసంగా ఉన్నా, డిఫరెంట్ బిహేవియర్ ఉన్నా, వృత్తిపట్ల అభద్రతా భావం, అనాసక్తి కనబరుస్తున్నా సహచరులు, ఫ్యాకల్టీ గుర్తించాలి. అటువంటి వారిని దగ్గరకు తీసుకోవాలి. వెనుకబడినట్టు ఉంటే వారికి మరింత సహకారాన్ని అందించాలి.
మనసు విప్పి సహచరులతో చెప్పుకోవాలి
- డాక్టర్ సంధ్యాదేవి, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సహచరులతో గానీ, ఫ్యాకల్టీతోగానీ చెప్పుకోవాలి. ఎవరితో ఒకరితో చెప్పుకోవడం ద్వారా కొంత ఉపశమనం దొరుకుతుంది. అదే సమయంలో సమస్యకు పరిష్కారాన్ని సూచించే అవకాశం లభిస్తుంది. ఈ తరహా ఆలోచనలకు చెక్ చెప్పే ఉద్దేశంతోనే విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇబ్బందులను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నాం. ఈ చైన్‌ను బ్రేక్ చేసేందుకు యత్నిస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ తరహా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలి.
మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించాలి
- డాక్టర్ రామిరెడ్డి, మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్
వైద్య విద్యలో చేరే సమయంలో విద్యార్థులకు కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. ఇకపై మానసిక సమస్యలతో బాధపడే వారిని ముందే గుర్తించేలా ఒక టీమ్‌ను ఏర్పాటుచేయాలి. అప్పుడే ఈ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి వారికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. చిన్న సమస్యలు కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వారికి పెద్దవిగా కనిపిస్తుంటాయి. అటువంటి వాటికి కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా పరిష్కారాన్ని చూపించవచ్చు.