నగరంలో వరుస హత్యలు!
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:11 AM
నగరంలో వరుసహత్యలు ప్రజలతో పాటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సర్వత్రా ఆందోళన
ఈ ఏడాది ఇప్పటివరకు పది ఘాతుకాలు
ఈనెలలోనే మూడు హత్యలు
వివాహేతర సంబంధాలు, రౌడీషీటర్ల ఆధిపత్య పోరే కారణం
రౌడీషీటర్లపై కొరవడిన పోలీసు నిఘా
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో వరుసహత్యలు ప్రజలతో పాటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను తీసేందుకు వెనుకాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కొరవడడంతో ఇటీవల చెలరేగిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంతనగరంలో ఇటీవల హత్యా సంస్కృతి పెచ్చరిల్లుతోంది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరుపై ఉక్కుపాదం మోపిన పోలీసులు తర్వాత ఇతర అంశాలపై దృష్టిసారించడంతో వారిపై నిఘాను కొనసాగించలేక పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల కిందట రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరడంతో అప్పటి పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లను గుర్తించి, వారి కదలికలను నిత్యం గమనించేందుకు ఒక్కో రౌడీషీటర్‌పై నిఘా బాధ్యతను ఒక్కో కానిస్టేబుల్‌కు అప్పగించారు. ఉదయం లేచినప్పటి నుంచి రౌడీషీటర్ ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవడంతో పాటు అతడి కుటుంబసభ్యులతోపాటు తరచూ టచ్‌లో ఉంటున్నవారిని ఫోన్ నంబర్లను కూడా ట్రాక్ చేసేవారు. దీనివల్ల రౌడీషీటర్లు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్, బౌండోవర్, నగర బహిష్కరణ వేటు వంటి చర్యలు తీసుకునేవారు. దీనివల్ల రౌడీషీటర్లు గొడవలు, సెటిల్‌మెంట్‌ల జోలికి వెళ్లకుండా భయంతో గడిపేవారు. దీతో నగరంలో హత్యలు, దాడులు తగ్గి శాంతిభద్రతలు అదుపులో ఉండేవి.
ఇటీవల పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. నిత్యం నగరంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలు, సదస్సులు జరగడం, ప్రముఖుల పర్యటనలు, స్థానికంగా ఉత్సవాలు, తదితర కార్యక్రమాలు పెరిగిపోయాయి. బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు రూట్‌చెకింగ్‌లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రౌడీషీటర్లపై నిఘా కొరవడి, ప్రతి ఆదివారం మొక్కుబడి కౌన్సెలింగ్‌లతోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో రౌడీషీటర్లు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని పోలీసులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హత్యలు పెరిగిపోతున్నాయని విశ్లేషిస్తున్నారు. 2024లో నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలో 24 హత్యలు జరిగితే 2025లో 35కి పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 నాటికి నగరంలో పది మంది హత్యకు గురవగా మూడు సంఘటనలు ఈ నెలలో జరగడం పరిస్థితికి అద్దంపడుతోంది.
ఈనెల 24న కైలాసపురం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రశాంత్ అనే ఆటోడ్రైవర్‌ను శ్రీను అనే మరో ఆటోడ్రైవర్ హత్యచేశాడు. తన సోదరితో వివాహేతర సంబంధం మానుకోవాలని హెచ్చరించినా వినకపోవడంతో కత్తితో పొడిచి చంపేశాడు. ఆరిలోవ పెదగదిలికి చెందిన రౌడీషీటర్ తనకు ఎదురుతిరుగుతున్నాడే అక్కసుతో అదే ప్రాంతానికి చెందిన అజిత్ క్రికెట్ ఆడుతుండగా గొడవ పెట్టుకుని, రాత్రి దారికాసి నడిరోడ్డుపై హత్యచేశాడు. ఈనెల 15న జోడుగుళ్లపాలేనికి చెందిన యువతిని ఆమె స్నేహితులే విశాలక్షినగర్‌లోని ఓ హోటల్‌లో తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. మార్చి 29న గాజువాక ఎల్‌వీనగర్‌లో నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని స్నేహితుడి రూమ్‌కు పిలిచి హత్యచేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి పోలీసులకు లొంగిపోయాడు.
నగరంలో హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్‌గా దృష్టిసారించకపోతే శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం పడుతుందని నగరవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిత్యం గొడవలు, బెదిరింపులకు పాల్పడడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే రౌడీషీటర్లతోపాటు ఆకతాయిలపై పోలీసులు నిఘా ఉంచాలని సూచిస్తున్నారు.
సంవత్సరంజరిగిన హత్యలు
2024 24
2025 35
2026 (ఏప్రిల్ 24 నాటికి) 10
------------------------