Share News

ట్రాఫిక్‌ రూటే సెపరేటు!

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:57 AM

నగరంలో వాహనాల రాకపోకలు సవ్యంగా సాగేలా చూడడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు.

ట్రాఫిక్‌ రూటే సెపరేటు!

దారితప్పిన ట్రాఫిక్‌

అసలు బాధ్యతలు పక్కనెట్టి ఈ-చలాన్ల తనిఖీ/వసూళ్లపైనే దృష్టి

ఐదు నుంచి పది మంది ఒకచోట చేరి వాహనాల తనిఖీ

సమీపంలోని కూడళ్లలో ట్రాఫిక్‌ నియంత్రణ గాలికి...

ఒకవైపు రోడ్డు ప్రమాదాల్లో పెరుగుతున్న మృతులు

సర్వత్రా విమర్శలు

ఉన్నతాధికారులు టార్గెట్‌లు ఇస్తున్నారని సిబ్బంది గగ్గోలు

ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని నగరవాసులు హితవు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో వాహనాల రాకపోకలు సవ్యంగా సాగేలా చూడడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై గతంలో విధించిన ఈ-చలాన్‌ల వసూలు, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఫొటోలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం అంతా ఒకచోట చేరుతున్నారు. కూడళ్లలో ట్రాఫిక్‌ పోలీసులు కనిపించకపోవడంతో వాహన చోదకులు కొందరు ఇష్టారాజ్యంగా వెళుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరణ, వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలను పక్కాగా పాటించేలా చూడడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూసేందుకు పోలీస్‌ శాఖలో ట్రాఫిక్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముఖ్యమైన కూడళ్ల వద్ద సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నగర ట్రాఫిక్‌ విభాగంలో ఒక ఏడీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 25 మందికిపైగా ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు 500 మంది ఉన్నారు. వీరిలో ఎస్‌ఐ అంతకంటే కిందిస్థాయి సిబ్బంది తమకు కేటాయించిన కూడలిలో నిలబడి ట్రాఫిక్‌ సిగ్నల్‌కు అనుగుణంగా వాహనాలను అనుమతించడం, నిబంధనలను ఉల్లంఘించి వెళ్లే వాహనాలకు ఫొటోలు తీసి తమ ఉన్నతాధికారుల ద్వారా ఈ-చలాన్‌లు జారీచేయించడం చేయాలి. ఉన్నతాధికారులు తమ పరిధిలో ట్రాఫిక్‌ సిబ్బంది పనితీరు పరిశీలిస్తూ తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నగరంలో ట్రాఫిక్‌ జామ్‌లకు, వాహనాలు క్రమపద్ధతిలో రాకపోకలు సాగిస్తుంటాయి కాబట్టి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదు. కానీ ప్రస్తుతం దీనికి విరుద్ధమైన పరిస్థితి నెలకొని ఉంది. కూడలిలో ఉండి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన సిబ్బంది కొంతమంది రోడ్డుపక్కన కుర్చీ వేసుకుని కూర్చొని సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు చెట్ల మధ్య నిలబడి లేదా కూర్చుని నిబంధనలకు విరుద్ధంగా వచ్చిపోయే వాహనాలకు ఫొటోలు తీయడంపైనే దృష్టిపెడుతున్నారు.

పదుల సంఖ్యలో ఒకచోట చేరి వాహనాల తనికీలు

నగరంలోని మద్దిలపాలెం, స్వర్ణభారతి స్టేడియం, సిరిపురం జంక్షన్‌, ఎంవీపీ అప్పూఘర్‌ జంక్షన్‌, అక్కయ్యపాలెం జంక్షన్‌ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులంతా ఒకచోట చేరి ఆ మార్గంలో వచ్చిపోయే వాహనాలను ఆపి పెండింగ్‌ చలాన్‌లను తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పెండింగ్‌ చలాన్‌ కలిగివుంటే వారితో అక్కడికక్కడే కట్టిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతుంటే అలాంటి వారిని ఆపి చలాన్‌ జారీచేస్తున్నారు. సమీపంలోని కూడలి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నాసరే తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. జంక్షన్‌లో పోలీసులు కనిపించకపోయేసరికి వాహన చోదకులు సిగ్నల్‌ జంప్‌ చేసి ఇష్టారాజ్యంగా వెళుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పది నెలల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మృతిచెందినవారి సంఖ్య పెరగడమే అందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. స్వర్ణభారతి స్టేడియం వద్ద మంగళవారం ఉదయం సుమారు పది మంది పోలీసులు ఒకచోట గుంపుగా చేరి అటువైపు వచ్చే వాహనాలను ఆపి చలానాలను తనిఖీ చేస్తూ, సమీపంలోని కూడలి వద్ద ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను గాలికి వదిలేయడంతో వాహనచోదకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ట్రాఫిక్‌ సిబ్బంది మాత్రం తమ అధికారులు నిత్యం టార్గెట్‌లు ఇస్తుండడంతో చలాన్‌లు తనిఖీ చేయాల్సి వస్తుందని చెప్పడం విశేషం. అధికారులు ఇప్పటికైనా తమ బాధ్యతను గుర్తించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:57 AM