Share News

చెదిరిన పక్షి గూడు

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:08 PM

మండలంలోని చిన్నగెడ్డ కాఫీ ఎస్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసిన బర్డ్‌నెస్ట్‌ శిథిలమైపోయింది. దీంతో సందర్శనలకు పర్యాటకులు దూరమయ్యారు.

చెదిరిన పక్షి గూడు
చిన్నగెడ్డ ఎస్టేట్‌ కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌లో శిథిలమైపోయిన బర్డ్‌నెస్ట్‌

చిన్నగెడ్డ కాఫీ ఎస్టేట్‌లో బర్డ్‌నెస్ట్‌ శిథిలం

పర్యాటకుల అసంతృప్తి

చింతపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నగెడ్డ కాఫీ ఎస్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసిన బర్డ్‌నెస్ట్‌ శిథిలమైపోయింది. దీంతో సందర్శనలకు పర్యాటకులు దూరమయ్యారు. చిన్నగెడ్డ ఎస్టేట్‌ పరిధిలో ఏపీఎఫ్‌డీసీ అధికారులు పర్యాటకులకు ప్రకృతి అందాలు, కాఫీ తోటలను పరిచయం చేసేందుకు కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ ఏర్పాటు చేశారు. కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌లో సందర్శకుల కోసం బర్డ్‌నెస్ట్‌, ఉడెన్‌ ట్రీ డెక్‌ ఏర్పాటు చేశారు. లంబసింగి సందర్శనకు వచ్చిన పర్యాటకులు అధిక సంఖ్యలో కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ని సందర్శించే వారు. ఉడెన్‌ బ్రిడ్జి, బర్డ్‌నెస్ట్‌ వద్ద ఫొటో షూట్‌ చేసుకునేవారు. కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని వుండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, ప్రజలు ఇక్కడ కొంత సమయం వెచ్చించి ఫొటోలు తీసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం ఉడెన్‌ డెక్‌ మాత్రమే వినియోగంలో ఉంది. బర్డ్‌ నెస్ట్‌ పూర్తిగా శిథిలమైపోయింది. దీంతో బర్డ్‌నెస్ట్‌ వద్ద కూర్చోవడానికి, ఫొటోలు తీసుకునేందుకు వీలుపడడం లేదు. దీనిపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ని సందర్శించే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికైనా ఏపీఎఫ్‌డీసీ అధికారులు స్పందించి కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌లో బర్డ్‌నెస్ట్‌తో పాటు అదనపు సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:08 PM