Share News

ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కి మోక్షం

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:20 AM

స్థానిక ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కి ఎట్టకేలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం రూ.3.5 కోట్లను విడుదల చేసింది. దీంతో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పనులు ప్రారంభించారు. ఐదేళ్ల తరువాత ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో కాఫీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కి మోక్షం
ఎకో పల్పింగ్‌ యూనిట్‌ని ఎక్స్‌కవేటర్‌తో చదును చేస్తున్న గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు

ఐదేళ్ల తరువాత నిర్మాణ పనులు పునఃప్రాంరభం

రూ.3.5 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

సంబరపడుతున్న గిరిజన కాఫీ రైతులు

గూడెంకొత్తవీధి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కి ఎట్టకేలకు మోక్షం కలిగింది. కూటమి ప్రభుత్వం రూ.3.5 కోట్లను విడుదల చేసింది. దీంతో శనివారం గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పనులు ప్రారంభించారు. ఐదేళ్ల తరువాత ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో కాఫీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ తరహాలో జీకేవీధి మండలాల్లోనూ ఎకో పల్పింగ్‌ రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జీకేవీధి కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణాలకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఐదేళ్లగా మొండిగోడలతో అక్కడి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. జీకేవీధిలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ కోసం కొనుగోలు చేసిన యంత్రాలు సైతం తుప్పుపడుతున్నాయి. ఈమేరకు ఎకో పల్పింగ్‌ యూనిట్ల తాజా పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. ఈమేరకు జీకేవీధి ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌కి నిర్మాణానికి రూ.3.5కోట్ల నిధులను మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్‌ జీవోను జారీ చేశారు. నిధులు సైతం అందుబాటులోకి రావడంతో గిరిజన సంక్షేమ శాఖ పనులను ప్రారంభించింది. రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ డీఈఈ జి. రఘునాథరావు నాయుడు తెలిపారు. అలాగే ఎకో పల్పింగ్‌ యూనిట్‌ ప్రహరీ గోడ నిర్మాణానికి అదనంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి రూ.40లక్షలు విడుదలయ్యాయని డీఈఈ తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 01:20 AM