అసంపూర్తి భవనాలకు మోక్షం
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:06 AM
జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేసిన విలేజ్ హెల్త్ సెంటర్ల భవనాలకు ఎట్టకేలకు కూటమి హయాంలో మోక్షం కలిగింది.
విలేజ్ హెల్త్ సెంటర్ల పనుల పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు
150 భవనాలకు రూ.20.99 కోట్లు మంజూరు
పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పనులు
మరో నెల రోజుల్లో పూర్తి
కొత్తగా ఆరు పీహెచ్‌సీలకు నూతన భవనాలు
రూ.2.16 కోట్లు మంజూరు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేసిన విలేజ్ హెల్త్ సెంటర్ల భవనాలకు ఎట్టకేలకు కూటమి హయాంలో మోక్షం కలిగింది. ఆయా భవనాల స్థితిగతులపై జిల్లా అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 150 భవనాలకు రూ.20.99 కోట్లు మంజూరు చేసింది. పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పనులు మొదలయ్యాయి.
వైసీపీ అధికారంలో వున్నప్పుడు గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల స్థానంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. ఒక్కో భవన నిర్మాణం అంచనా వ్యయం రూ.26.8 లక్షలు. జిల్లాకు 200కుపైగా హెల్త్ క్లినిక్‌లకు భవనాలు మంజూరయ్యాయి. అప్పట్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు పనులు మధ్యలో ఆపేశారు. కొన్నిచోట్ల పునాదుల దశలో ఉండగా, మరికొన్నిచోట్ల శ్లాబ్‌లు వేసి వదిలేశారు. అనకాపల్లి డివిజన్ పరిధి 66 భవనాలు, నర్సీపట్నం డివిజన్ పరిధిలో 84 భవనాలు.. మొత్తం 150 భవనాల పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విలేజ్ హెల్త్ సెంటర్ల భవనాల స్థితిగతులపై సంబంధిత అధికారులను నివేదిక అడిగింది. ఆయా భవనాలకు మిగిలిన పనులు పూర్తిచేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? కాంట్రాక్టర్లకు ఎంత మేర బిల్లులు పెండింగ్‌లో వున్నాయి? అన్న వివరాలను రూపొందించడానికి జిల్లా అధికారులకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు నివేదికను కొద్ది నెలల క్రితం ప్రభుత్వానికి సమర్పించారు. పెండింగ్ బిల్లులతోపాటు మిగిలిన పనులు చేయడానికి ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అవసరం అవుతాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో 150 భవనాలకు ప్రభుత్వం రూ.20.99 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇటీవల పనులు ప్రారంభించారు. దీనిపై పీఆర్ ఈఈ జగదీశ్‌ను వివరణ కోరగా.. భవనాల నిర్మాణ పనులు ఇటీవల పునఃప్రారంభం అయ్యాయని, మరో నెల రోజుల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. జిల్లాలో కొత్తగా ఆరు ఆరోగ్య కేంద్రాలకు భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.36 లక్షల చొప్పున రూ.2.16 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. వీటిని నర్సీపట్నం, ఎలమంచిలి, రాంబిల్లి, నక్కపల్లి, గొలుగొండ, అచ్యుతాపురం మండలాల్లో నిర్మిస్తామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన వివరించారు.