Share News

ప్రయాణికుల భద్రతకు దర్పణం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:02 PM

నిత్యం రద్దీగా ఉండే పాడేరు ఘాట్‌ మార్గంలో ప్రమాదాలను నియంత్రించేందుకు రోడ్లు, భవనాల శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రయాణికుల భద్రతకు దర్పణం
ఘాట్‌లో ఒక మలుపు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ మిర్రర్‌

పాడేరు ఘాట్‌లోని 20 మలుపుల్లో సేఫ్టీ మిర్రర్‌ల ఏర్పాటు

ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు

ఆనందం వ్యక్తం చేస్తున్న డ్రైవర్లు, ప్రయాణికులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

నిత్యం రద్దీగా ఉండే పాడేరు ఘాట్‌ మార్గంలో ప్రమాదాలను నియంత్రించేందుకు రోడ్లు, భవనాల శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఘాట్‌లో ప్రమాదకరంగా ఉన్న 20 మలుపుల వద్ద సేఫ్టీ మిర్రర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాహనం ఆ కుంభాకార దర్పణంలో కనిపిస్తుంది. దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టుకోకుండా సురక్షితంగా మలుపులు దాటుతాయి.

ఎక్కడైనా ఘాట్‌ మార్గం మలుపుల్లోనే వాహనచోదకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. మలుపుల వద్ద తుప్పలు అధికంగా ఉండడంతో పాటు మలుపు ఇరుకుగా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించని పరిస్థితుల్లో రెండు వాహనాలు ఢీకొట్టుకుని ప్రమాదాలకు గురవుతుంటాయి. దీంతో ఘాట్‌లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలకు లోనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో రావడం, వారికి స్థానిక ఘాట్‌లో పరిస్థితులు అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఘాట్‌లో పెరుగుతున్న వాహనాల రాకపోకలు

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే, ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్‌ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతోపాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంలో పోల్చితే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్‌ మార్గం నిత్యం వాహనాలతో రద్దీతో పాటుప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్లు, భవనాల శాఖాధికారులు మలుపుల వద్ద సేఫ్టీ మిర్రర్‌లు ఏర్పాటు చేయడం పట్ల డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:02 PM