అరుదైన పుష్పం కనువిందు
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:16 PM
మండల కేంద్రం ఆదివాసీ ప్రభావిత పథం చర్చి ఆవరణలో హైడ్రేంజియా(జల పుష్పం) అమితంగా ఆకట్టుకుంటున్నది.
ఆకట్టుకుంటున్న హైడ్రేంజియా ఫ్లవర్
చింతపల్లి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం ఆదివాసీ ప్రభావిత పథం చర్చి ఆవరణలో హైడ్రేంజియా(జల పుష్పం) అమితంగా ఆకట్టుకుంటున్నది. ఈ పూల మొక్కలు శీతల వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి. ప్రధానంగా జపాన్, చైనా, కొరియా, అలాగే ఉత్తర అమెరికాలో విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలు, ఊటీ, కొడైకెనాల్, కేరళ మున్నార్ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్క నేల పీహెచ్(ఆమ్లజని) స్థాయి ఆధారంగా పూల రంగులు మారుతుంటాయి. చిన్నచిన్న పూలన్నీ కలిసి ఒక బంతి ఆకారంలో కనిపిస్తుంది. హైడ్రో అంటే నీరు, ఈ మొక్కకు నీరు అధికంగా అవసరం. అందుకే హైడ్రేంజియా అని పేరు వచ్చింది. కొన్నేళ్ల క్రితం పాస్టర్ డీ ఈనక్ ఈ మొక్కను తీసుకొచ్చి చర్చి ఆవరణలో నాటారు. ప్రతి ఏటా శీతాకాలం, వర్షాకాలంలో ఈ మొక్క పూలను పూస్తుంది. ప్రారంభంలోనే ఆకుపచ్చ వర్ణంలో, బాగా పక్వానికి వచ్చినప్పుడు పింక్(గులాబీ), చివరి దశలో తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. ఈ పూలు మొక్క వద్ద వాడిపోకుండా 45 రోజులు మూడు వర్ణాల్లో స్థానికులకు కనువిందు చేస్తుంది. ఈ పూలను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.