Share News

ఉక్కులో తొలగని ముప్పు

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:07 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.

ఉక్కులో తొలగని ముప్పు

తాజాగా ల్యాడిల్‌ నుంచి పైకెగిసిన ఫైర్‌ బాల్‌

కార్మికులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం

అప్పటి ప్రమాదంపై ఇంకా బయటకు రాని త్రిసభ్య కమిటీ నివేదిక

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ల్యాడిల్‌ పేలుళ్లకు ఫుల్‌స్టాప్‌ పడలేదు. పది మంది మరణించిన ఘటనపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదిక వెలుగు చూడలేదు. జిల్లా అధికారులు ఆ ప్రమాదంపై నోరు విప్పడం లేదు. రాష్ట్ర మంత్రి పరామర్శకు వచ్చి ‘స్టీల్‌ ప్రాసెస్‌లో ఏ తప్పు జరగలేదు’ అని కితాబు ఇచ్చిన తరువాత ఇక ఏమి చెప్పినా వినే పరిస్థితి లేదని అంతా మౌనం పాటిస్తున్నారు. తాజాగా అదే విభాగంలో శుక్రవారం మరోసారి ల్యాడిల్‌ నుంచి ఫైర్‌బాల్‌ ఎగిసిపడింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కానప్పటికీ కార్మికులు బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సి వస్తోంది.

స్టీల్‌ప్లాంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఎనిమిదో తేదీన ల్యాడిల్‌లో హాట్‌మెటల్‌ పేలి మొత్తం పది మంది మరణించారు. అసలు దేశ చరిత్రలోనే ఇలాంటి పేలుడు ఇప్పటివరకు జరగలేదు. దీనికి కారణాలు వెల్లడించి, మరోమారు జరగకుండా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ ఏ తప్పూ జరగలేదని ప్లాంటు యాజమాన్యాన్ని వెనకేసుకువస్తున్నారు. ఆ ఘటన జరిగిన రెండు రోజులకు మళ్లీ ఓ ల్యాడిల్‌ ప్రమాదం జరిగింది. ఆ స్థాయి పేలుడు కాకపోయినా శుక్రవారం ఎస్‌ఎంఎస్‌ విభాగంలో మెషీన్‌ నంబరు 1 వద్ద 98వ నంబరు హీట్‌ తీస్తున్నప్పుడు పెద్ద అగ్నిగోళం (ఫైర్‌ బాల్‌) ఎగిసిపడింది. అంతా అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. హాట్‌మెటల్‌కు అల్యూమినియం కలిపిన తరువాత సరైన విధంగా ‘రిన్సింగ్‌’ జరగలేదని, అందుకే అలా అయ్యిందని, ఇకపై హాట్‌మెటల్‌ను సరైన రిన్సింగ్‌తో పంపాలని అధికారులు తక్షణమే ఆదేశించారు.

ఎస్‌ఓపీల అములపై శ్రద్ధ

ఈ నెల 8న భారీ ప్రమాదం జరగడానికి ‘స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌’ (ఎస్‌ఓపీ) పాటించకపోవడమే ప్రధాన కారణమని ప్లాంటు అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. కమిటీ కూడా ఆ రకమైన అభిప్రాయమే వ్యక్తంచేసిందని సమాచారం. రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం స్టీల్‌ ప్రాసెసింగ్‌ చేయాలని ఆదేశించింది. స్టీల్‌ తయారీలో ప్రతి ప్రాసెస్‌కు కొంత నిర్దేశిత సమయం ఉంటుంది. కచ్చితంగా ఆ సమయం పాటించాలని, ఆలస్యం అవుతుందని కొన్ని దశలను బైపాస్‌ చేసి ముందుకు వెళ్లవద్దని స్పష్టంచేసింది. హాట్‌మెటల్‌ను ప్యూరిఫై చేయడానికి అల్యూమినియం, ఫెర్రో అల్లాయిస్‌ వంటి మెటల్స్‌ కలిపిన తరువాత కచ్చితంగా 8 నుంచి 10 నిమిషాలు రిన్సింగ్‌ ప్రక్రియ చేయాలని స్పష్టంచేసింది. ఆ తరువాత ఆ ల్యాడిల్‌లో శాంపిల్‌ తీసి, దాని క్వాలిటీపై మూడు నిమిషాల్లో ల్యాబ్‌ నుంచి నివేదిక తెప్పించుకొని, సూచనల ప్రకారం ముందుకు వెళ్లాలని, ఆపైనే మౌల్డింగ్‌ చేయాలని ఆదేశించింది. మొన్న జరిగిన ప్రమాదంలో రిన్సింగ్‌ తరువాత శాంపిల్‌ తీయలేదని ఒక అంచనాకు రావడంతో అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నారు.

అదే నాసిరకం మెటీరియల్‌ వినియోగం

హాట్‌మెటల్‌ ప్యూరిఫికేషన్‌కు ప్లాంటులో వినియోగిస్తున్న అల్యూమినియం, ఫెర్రోఅల్లాయిస్‌ నాసిరకంగా ఉన్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల ఇంకా వాటినే ఉపయోగించాల్సి వస్తోంది. ఇకనైనా నాణ్యత కలిగిన మెటీరియల్‌ సరఫరా చేయాలని, క్వాలిటీ కంట్రోల్‌ సరైన తనిఖీలు నిర్వహించాలని ఉక్కు అధికారులు కోరుతున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 01:07 AM