చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:16 AM
మునిసిపాలిటీలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. తడి, పొడి చెత్తను ఏ రోజుకారోజు శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ‘ఐవే అసోసియేట్స్’తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
నర్సీపట్నంలో రూ.3 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్
బలిఘట్టం కంపోస్టు యార్డులో నిర్మాణం
తడి, పొడి వ్యవర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థతో ఒప్పందం
తడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువు తయారీ
నర్సీపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. తడి, పొడి చెత్తను ఏ రోజుకారోజు శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ‘ఐవే అసోసియేట్స్’తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.3 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. పట్టణంలో చెత్త సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాక గతంలో మాదిరిగా డంపింగ్ యార్డులు, వాటిలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం ఇకపై కనిపించవు. పారిశుధ్య సిబ్బంది రోజూ వీధులు, ఇళ్లల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తారు. దీనిని ఎప్పుటికప్పుడు ప్రాసెసింగ్ యూనిట్‌కి తరలిస్తారు. ఇందుకు సంబంధించి బలిఘట్టం కంపోస్టు యార్డులో ప్రస్తుతం ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుతున్నాయి. రెండు పెద్ద షెడ్లు, ప్లాట్ ఫారం, అండర్ గ్రౌండ్ ట్యాంకు నిర్మిస్తారు. అనంతరం అవసరమైన యంత్ర పరికరాలను అమరుస్తారు. తడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువు తయారు చేస్తారు. పొడి చెత్తలో ప్లాస్టిక్, గాజు, ఇనుము వంటి వాటిని వేరు చేసి రీసైక్లింగ్ యూనిట్‌కి పంపుతారు. తడి చెత్త నుంచి వచ్చే మురుగు నీరు భూమిలోకి ఇంకకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా లిచెట్ ట్యాంక్‌కి పంపిస్తారు. కొద్ది రోజులు మురిగిన తరువాత ఎరువుగా మారుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని నిర్వహించడానికి ఐవే అసోసియేట్స్‌తో మునిసిపాలిటీ ఒప్పందం చేసుకుంటుంది.
డంపింగ్ యార్డులో తరిగిన చెత్త
బలిఘట్టం డపింగ్ యార్డులో పేరుకు పోయిన చెత్తలో ఇంతవరకు సుమారు 15 వేల టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశారు. ఇంకా ఎనిమిది వేల టన్నుల వరకు చెత్త ఉండవచ్చు అని అధికారులు అంచనాగా చెబుతున్నారు. ఇక్కడి చెత్తను శుద్ధి చేసే కాంట్రాక్టులను తరుణి అసోసియేట్స్‌కి అప్పగించిన సంగతి తెలిసిందే. బలిఘట్టం డంపింగ్ యార్డులో చాలా వరకు చెత్త తరిగిపోయింది. త్వరలో ప్రాసెసింగ్ యూనిట్ కూడా అందుబాటులోకి వస్తుందని, దీంతో నర్సీపట్నంలో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మునిసిపల్ కమిషనర్ సురేంద్ర చెప్పారు.