ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:54 AM
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, బాధిత వర్గాలకు అండగా నిలవాలని ఏపీ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు.
బాధిత వర్గాలకు అండగా నిలవాలి
అధికారులకు ఏపీ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు ఆదేశం
గాజువాక ఎమ్మెల్యే సమర్పించిన 14 అంశాలపై సమీక్ష...అధికారులకు సూచనలు
యారాడ వద్ద జెట్టీ నిర్మాణానికి డీపీఆర్ తయారుచేయాలని ఆదేశం
ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నా ఇళ్లు రిజిస్ర్టేషన్ చేయడం లేదన్న ‘నార్త్’ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, బాధిత వర్గాలకు అండగా నిలవాలని ఏపీ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం గాజువాక నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. తొలుత గాజువాకలో పెండింగ్‌లో ఉన్న 14 ప్రజా పిటిషన్ల పరిష్కారానికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల స్వభావం, పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందులు, చట్టపరమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఏపీఐఐసీ భూసేకరణతో నిర్వాసితులైన కుటుంబాల సమస్యలు, పునరావాసం, గాజువాక అపెరల్ పార్కు పరిధిలో అనధికారిక కార్యకలాపాలు, భూములు కోల్పోయిన రైతుల సమస్యలు, నిర్వాసితులకు ప్లాట్‌ల కేటాయింపు, భూములు తిరిగి స్వాధీనం వంటి అంశాలపై అధికారులు ఇచ్చిన సమగ్ర నివేదికలను కమిటీ పరిశీలించింది. భూ సేకరణ కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీల అమలు స్థితిగతులు, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి అవకాశాలపై కూడా కమిటీ సభ్యులు ఆరాతీసింది. పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను సూచించింది. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సమస్యల పరిష్కారానికి శాసనసభ పిటిషన్ల కమిటీ ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అంశాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించి న్యాయబద్ధమైన పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు యారాడ వద్ద జెట్టీ నిర్మాణానికి అధికారులు చొరవ చూపాలని పేర్కొంటూ దానికి సంబంధించి త్వరితగతిన డీపీఆర్ సిద్ధ్దం చేయాలని ఆయన ఆదేశించారు. జీవీఎంసీ పరిధిలో చేపట్టిన భూసేకరణ, రహదారుల విస్తరణ పనులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రభావితమైన వ్యక్తుల సమస్యలను కమిటీ పరిశీలించిందన్నారు. భూముల స్వాధీన ప్రక్రియలో పరిహారం చెల్లింపులు, టీడీఆర్‌ల జారీ, రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి అందిస్తున్న ప్రయోజనాలు, స్థలాల కేటాయింపు వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి పలు వినతులను కమిటీ పరిశీలించింది. నీటి వనరుల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, 22-ఎ జాబితాల్లో ఉన్న భూములు సమస్యలు, ఫార్మా సిటీ పునరావాస కాలనీల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ అంశాలు, భూ రికార్డుల నవీకరణ వంటి విషయాలపై చైర్మన్, సభ్యులు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏళ్ల తరబడి నివసిస్తున్నా రిజిస్ట్రేషన్‌లు కావడంలేదు: ఉత్తర ఎమ్మెల్యే
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కామర్స్ అండ్ ఇండస్ర్టీ, రెవెన్యూ, ఏపీఐఐసీ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలోని 14 అంశాలపై సమస్యలను నివేదించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా అదే తరహా సమస్యలను ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నప్పటికీ 22ఎ జాబితాలో పెట్టడంతో వారుంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు సమస్యలను కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. భూ బదలాయింపు ప్రక్రియలో రెవెన్యూ అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సానుకూల దృక్పథంతో చర్యలు: జేసీ
జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి మాట్లాడుతూ కమిటీ సూచనల మేరకు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం సానుకూల దృక్పథంతో చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పిటిషన్ పురోగతిని పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావుతో పాటు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.