Share News

మానని గాయం

ABN , Publish Date - May 07 , 2026 | 01:07 AM

ఎల్జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీకైన ఘటన జరిగి ఆరేళ్లు అయినా నేటికీ వెంకటాపురం గ్రామస్థుల్లో భయం వీడలేదు. పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ నిల్వ చేసిన ట్యాంకుల నుంచి 2020 మే ఏడో తేదీ తెల్లవారుజామున విషవాయువు లీకవ్వడంతో 15 మంది మృతిచెందగా, వందలాది ఆస్పత్రి పాలయ్యారు. వెంకటాపురం, కంపరపాలెం, పద్మనాభనగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ఉదంతం యావత్‌ విశాఖ నగర ప్రజలకు రెండు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

మానని గాయం

ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజీ ఘటనకు ఆరేళ్లు

విషం చిమ్మిన రాత్రిని తలుచుకుని నేటికీ ఉలిక్కిపడుతున్న జనం

గత ప్రభుత్వంలో బాధితులకు జరగని న్యాయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.60 కోట్లు సాయం

గోపాలపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి):

ఎల్జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీకైన ఘటన జరిగి ఆరేళ్లు అయినా నేటికీ వెంకటాపురం గ్రామస్థుల్లో భయం వీడలేదు. పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ నిల్వ చేసిన ట్యాంకుల నుంచి 2020 మే ఏడో తేదీ తెల్లవారుజామున విషవాయువు లీకవ్వడంతో 15 మంది మృతిచెందగా, వందలాది ఆస్పత్రి పాలయ్యారు. వెంకటాపురం, కంపరపాలెం, పద్మనాభనగర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ఉదంతం యావత్‌ విశాఖ నగర ప్రజలకు రెండు రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.60 కోట్ల సాయం

అప్పటి వైసీపీ ప్రభుత్వం మృతులకు రూ.కోటి చొప్పున, సుమారు 16 వేల మంది బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేసింది. ఆ తరువాత ఐదేళ్ల పాటు బాధితులను పట్టించుకోలేదు. హామీలను నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కంపెనీ రెడ్‌ జోన్‌ పరిధిలో ఉన్న కుటుంబానికి రూ.3.5 లక్షల చొప్పున, అదేవిధంగా విషవాయువు ప్రభావిత ప్రాంతంలోని సుమారు 6,750 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున సుమారు రూ.60 కోట్లు ఆర్థిక సాయం అందించారు.

కంపెనీ తెరిపించాలని కోరుతున్న గ్రామస్థులు

కంపెనీ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అప్పట్లో నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పుడు అదే జరుగుతోంది. గ్రామానికి చెందిన పలువురు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మరోవైపు కంపెనీ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబీకులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీని కాలుష్య రహిత కర్మాగారంగా ఎల్జీ సంస్థ పునఃప్రారంభించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఆ దిశగా నేతలు కృషి చేయాలని అభ్యర్థిస్తున్నారు.

బాధితుల న్యాయమైన డిమాండ్‌లు నెరవేర్చాలి

గొన్నాబత్తుల శ్రీనివాస్‌,

వెంకటాపురం నివాసితుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు (6జిపిటి21)

విషవాయువు ఘటన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా గ్రామస్థులకు హెల్త్‌ కార్డులు మంజూరు చేయలేదు. బాధితులకు దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉన్నందున తరచూ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మల్టీస్పెషాలిటీ సేవలు అందేలా హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు మరింత పరిహారం అందజేయాలి.

ఉపాధి కల్పించాలి

బీటీవీ సత్యనారాయణ, గ్యాస్‌ లీకేజీ బాధితుల సంఘ అధ్యక్షుడు

(6జిపిటి22,

విషవాయువు ఘటన కారణంగా కంపెనీ మూతపడడంతో గ్రామస్థులు ఉపాధి కోల్పోయారు. కాలుష్య రహిత కర్మాగారాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు 70 శాతం ఉపాధి కల్పించాలి. బాధితులకు జీవితకాలం ఉచిత వైద్యం అందించాలి. క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించాలి. గ్రామంలో 51 కుటుంబాలకు పరిహారం అందజేయాలి.

Updated Date - May 07 , 2026 | 01:09 AM