అతివకు అందలం
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:22 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ సీటుకు రిజర్వేషన్ ఖరారైంది.
మహిళ(జనరల్)కు జీవీఎంసీ మేయర్ సీటు
రిజర్వేషన్ ఖరారు
ఓపెన్ కేటగిరీ కావడంతో ఏ వర్గానికైనా పోటీ చేసేందుకు అవకాశం
కూటమిలో తీవ్ర పోటీ
రేస్‌లో టీడీపీ నేతల కుటుంబ సభ్యులు
ఎమ్మెల్యే పల్లా, పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, సీనియర్ నేత గంటా, గండి బాబ్జీ, పక్కుర్తి మురళి కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నట్టు ప్రచారం
బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుటుంబీకులు...
జనసేన నుంచి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సతీమణి,
‘నార్త్’ ఇన్‌చార్జి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్ ఉషశ్రీ...
వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కోడలు, వరుడు కల్యాణి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ సీటుకు రిజర్వేషన్ ఖరారైంది. ఓపెన్ కేటగిరీ/జనరల్ మహిళకు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీ మహిళకు కేటాయిస్తారని బాగా ప్రచారం జరిగింది. అలాకాకుండా మహిళ-జనరల్‌గా కేటాయించడం వల్ల ఏ వర్గానికి చెందిన మహిళలైనా పోటీ చేసే అవకాశం దక్కింది. కూటమిలో మూడు పార్టీలు ఉండగా మేయర్ స్థానానికి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ప్రస్తుతం ఆయా పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్న కుటుంబ సభ్యుల పేర్లే ప్రచారంలోకి వచ్చాయి.
తెలుగుదేశం పార్టీని తీసుకుంటే రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన భార్య లావణ్యను పోటీకి దించుతారని అంటున్నారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎంపీ ఎం.శ్రీభరత్ భార్య, బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేరు కూడా వినిపిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు పట్టాభి తన భార్య పేరు పరిశీలించాలని కోరినట్టు సమాచారం. అదేవిధంగా సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ భార్య, మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే పెందుర్తి టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ తన కుమారుడు వంశీ భార్య జాగృతి పేరు పరిశీలించాలని కోరుతున్నారు. మాజీ మేయర్ డీవీ సుబ్బారావు కుమారుడు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డీవీ సోమయాజులు సతీమణి శర్వాణిని పోటీకి దింపుతారా?...అని అధిష్ఠానం ఆ కుటుంబాన్ని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. గాజువాక ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిగా గుర్తింపుపొందిన పక్కుర్తి మురళి తన భార్య కొడాలి ఉష పేరును పరిశీలించాల్సిందిగా కోరినట్టు తెలిసింది. ఇంకా మాజీ కార్పొరేటర్లు మొల్లి హేమలత, గొలగాని మంగవేణి, గాడు చిన్నికుమారిలక్ష్మి, బొట్ట రమణ కుమార్తె, అక్కరమాని కుటుంబం కోడలు రోహిణిలు కూడా మేయర్ సీటు ఆశిస్తున్నారు.
జనసేన నుంచి
విశాఖలో మేయర్ స్థానం తమ చేతిలో ఉంటే బాగుంటుందని జనసేన కూడా భావిస్తోంది. ‘సౌత్’ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన భార్యను పోటీకి దించాలని అనుకుంటున్నారు. అలాగే ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్ కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన 43వ వార్డు మాజీ కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఇటీవల పవన్ కల్యాణ్‌ని కలసి మేయర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. ఆమె కూడా బలంగానే ప్రయత్నిస్తున్నారు.
బీజేపీలో
భారతీయ జనతా పార్టీ కూడా విశాఖ మేయర్ స్థానం తమకే కేటాయించాలని కోరుతోంది. ఇప్పుడు మహిళ-ఓసీ కావడంతో ఆ విభాగంలో ఎవరు ముందుకు వచ్చినా పోటీ చేసే అవకాశం కల్పించాలని స్థానిక నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తన భార్యను విశాఖ మేయర్‌గా పోటీకి దించుతారని బాగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె శ్యామలా దీపిక కూడా పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మేయర్ స్థానం మహిళలకే కేటాయించడంతో ఆమె తన పోటీకి అవకాశాలు మెరుగుపడ్డాయని భావిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తన భార్యను పోటీకి దించే అవకాశం కూడా ఉందని సమాచారం.
వైసీపీలో భారీగా ఆశావహులు
వైసీపీ నుంచి మేయర్ సీటుకు పోటీ పడే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ‘సౌత్’ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కోడలి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంకా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ భార్య, ప్రస్తుత ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేర్లు వినిపిస్తున్నాయి.
బీసీలకు 49 వార్డులు
జనరల్ 60
ఎస్సీలకు 10,
ఎస్టీలకు ఒకటి...
120 వార్డుల్లో 60 మహిళలకు
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీల వార్డుల రిజర్వేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ పరిధిలో 120 వార్డులు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు పది, బీసీలకు 49, జనరల్‌కు 60 సీట్లు కేటాయించింది. ఎస్సీలకు కేటాయించిన పదింట్లో ఐదు మహిళలకు, బీసీలకు కేటాయించిన 49లో 24 మహిళలకు, జనరల్ కేటగిరీకి కేటాయించిన 60 వార్డుల్లో 31 మహిళలకు రిజర్వు చేసింది. జీవీఎంసీ కార్పొరేటర్‌లలో సగం మంది మహిళా కార్పొరేటర్‌లు ఉండనున్నారు.
ఏయూలో ఓట్ల లెక్కింపు
స్ర్టాంగ్ రూమ్‌లు కూడా...
ఏర్పాట్లు పరిశీలించిన
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ర్టాంగ్ రూమ్‌లను కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఏయూలో ఎంపిక చేసిన రూమ్‌లకు తరలించనున్నారు. స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద భద్రతాపరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే న్యూక్లాస్‌రూమ్ బ్లాక్, ఇనుస్ర్టుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు, ఎకనామిక్స్, ప్రిన్సిపల్ బ్లాక్, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ విభాగాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో తగిన గాలి, వెలుతురు, విద్యుత్ సదుపాయం ఉండేలా చూడాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు, రిసెప్షన్ కేంద్రాలు, ఫుడ్ కౌంటర్‌లు, అవసరానికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీప్లానర్ ఎ.ప్రభాకరరావు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.
a