అక్కరకు రాని పార్కింగ్ భవనం
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:36 AM
నగరంలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది.
పేరుకే ‘మల్టీ లెవెల్ కారు పార్కింగ్’
12 అంతస్థుల్లో పార్కింగ్‌కు మిగిలింది నాలుగే
అందుబాటులోకి తీసుకురావడంలో ఎడ తెగని జాప్యం
వాహనాలన్నీ బయటే పార్కింగ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి పరిష్కారంగా వీఎంఆర్‌డీఏ సిరిపురం జంక్షన్‌లో ‘మల్టీ లెవెల్ కారు పార్కింగ్’ (ఎంఎల్‌సీపీ) పేరుతో అందమైన భవనం నిర్మించినా అందులో పార్కింగ్ సదుపాయం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ భవనం ప్రారంభించి ఈ ఆగస్టుకు ఏడాది పూర్తవుతుంది. అయినా పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు.
విశాఖలో పార్కింగ్ సమస్య పరిష్కారానికి జీవీఎంసీ జగదాంబ జంక్షన్‌లో ఒక మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని ప్రజలు సక్రమంగా ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి, బయట పార్కింగ్ లేకుండా, వాహనాలు అందులో పెట్టేలా ఆదేశాలు ఇస్తున్నారు. వీఎంఆర్‌డీఏ వద్ద మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్కింగ్ కోసమే రూ.88 కోట్లతో ప్రత్యేక భవనం నిర్మించినా అందులో ఇప్పటివరకూ పార్కింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఆ జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవన్‌కు వివిధ పనులపై రోజూ వందలాది మంది వస్తారు. వారు తమ వాహనాలను ఉద్యోగ భవన్‌కు, డెక్‌కు మధ్యనున్న రహదారికి అటుఇటు పార్కింగ్ చేసుకుంటున్నారు. ఆ స్థలాలు సరిపోక గురజాడ కళాక్షేత్రం వైపు రహదారిని ఆనుకొని పార్కింగ్ చేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ అధికారులు డెక్‌లో అంతస్థులను అద్దెకు ఇచ్చి ఆదాయం పొందాలనే ధ్యాసలో పార్కింగ్ అంశాన్ని పూర్తిగా విస్మరించారు. ఈ భవనం అందమైన షిప్ డెక్ నమూనాలో నిర్మించడంతో ఇందులో కమర్షియల్ స్పేస్ సిటీలో అత్యధిక ధర పలుకుతోంది. చదరపు అడుగు రూ.140 చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌టీ రూ.65 నుంచి రూ.80 వరకు ఉంటే ఇక్కడ అంతకు రెట్టింపు ఉంది. ఈ భవనంలో మొత్తం 12 అంతస్థులు ఉండగా అందులో ఐదు అంతస్థులు పార్కింగ్‌కు కేటాయించి మిగిలినవి పలు సంస్థలకు అద్దెకు ఇచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, భెల్ కార్యాలయం వంటివి ఇక్కడే ఉన్నాయి. ఐదు పార్కింగ్ అంతస్థుల్లో ఒక దానిని రూ.4.5 కోట్లతో మార్పులు చేసి ఆఫీసుకు లీజుకు ఇచ్చేశారు. ఇక మిగిలింది నాలుగు అంతస్థులే. అందులో 1, 2, 3 బేస్‌మెంట్లు కాగా ఇంకొకటి మొదటి అంతస్థు. వీటిలో రెండు బేస్‌మెంట్లు రైల్వే జోన్ అధికారుల వాహనాలకు కేటాయించేశారు. మిగిలింది ఇంకో రెండు అంతస్థులే. వాటిలో 150 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. వాటిని నిర్వహణలోకి తీసుకురావడానికి అధికారులకు తీరిక లేకుండా పోయింది. వీఎంఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ అనధికార పార్కింగ్ వాహనాలు వందల సంఖ్యలో ఉంటున్నా...ఎంఎల్‌సీపీని వినియోగంలోకి తీసుకురావడంలో శ్రద్ధ చూపడం లేదు. వెంటనే ఈ పార్కింగ్‌ను నిర్వహణకు ఇచ్చి, అన్ని వాహనాలు అక్కడే పార్కింగ్ చేసేలా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే దీని ప్రయోజనం నీరుగారినట్టే.