పాత చెరువుకు కొత్త రూపు!
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:46 AM
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సును ఆనుకుని ఉన్న పాత చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పిల్లలు ఆడుకునేందుకు పార్కు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, గట్టుపై జాతీయ నేతల విగ్రహాలు, చెరువు మధ్యలో గణేశుని విగ్రహం, బోటు షికారు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
చోడవరంలో పర్యాటక కేంద్రంగా మారనున్న తటాకం
పార్కు, వాకింగ్ ట్రాక్, విగ్రహాలు, బోటు షికారు
రూ.50 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన వీఎంఆర్‌డీ
మరో రూ.కోటిన్నర వరకు సీఎస్‌ఆర్, దాతల నుంచి సేకరణ
చోడవరం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సును ఆనుకుని ఉన్న పాత చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పిల్లలు ఆడుకునేందుకు పార్కు, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, గట్టుపై జాతీయ నేతల విగ్రహాలు, చెరువు మధ్యలో గణేశుని విగ్రహం, బోటు షికారు వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీటికి సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో నాలుగో వంతు సొమ్ము.. రూ.50 లక్షలు మంజూరు చేయడానికి వీఎంఆర్‌డీఏ ముందుకు వచ్చింది. మిగిలిన నిధులను జిల్లాలోని పరిశ్రమలు (సీఎస్‌ఆర్), స్థానిక దాతల నుంచి సేకరించాలని ఎమ్మెల్యే రాజు భావిస్తున్నారు.
చోడవరం పట్టణ నడిబొడ్డున స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి సమీపంలో సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువు ఉంది. కాలక్రమేణా ఇది ఆక్రమణలను గురవుతూ వస్తున్నది. అంతేకాక చెత్తాచెదారంతో డంపింగ్ యార్డుగా తయారైంది. తీవ్ర దుర్వాసనతో సమీపంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, ఆలయానికి వచ్చే భక్తులు ముక్కు మూసుకోవాల్సి వస్తున్నది. చెరువును ప్రక్షాళన చేయడానికి పంచాయతీ వద్ద నిధులు లేకపోవడంతో మరింత దుర్భరంగా మారింది. చెరువును సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామని వైసీపీ హయాంలో పాలకులు ప్రకటించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు అభ్యర్ధన మేరకు పాత చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వీఎంఆర్‌డీఏ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.50 లక్షలు మంజూరు చేసింది. వీఎంఆర్‌డీఏ ఈఈ ఇటీవల ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యే రాజుతో కలిసి చెరువును పరిశీలించారు.
మారనున్న రూపురేఖలు
చోడవరం పాత చెరువును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడంలో భాగంగా చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సేదతీరడానికి పార్కును ఏర్పాటు చేస్తారు. ఇంకా చెరువు గట్టుపై జాతీయ నేతల విగ్రహాలు, మధ్యలో గణేశుని విగ్రహం ప్రతిష్ఠిస్తారు. ఇదే సమయంలో చెరువు గట్టు అవతల ఉన్న అంకుపాలెం, తదితర గ్రామాలకు రాకపోకలకు వీలుగా రహదారిని కూడా నిర్మిస్తారు. ఈ పనులన్నీ చేయడానికి సుమారు రూ.2 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో రూ.50 లక్షలు వీఎంఆర్‌డీఏ ఇస్తుండగా, మిగిలిన సొమ్మును ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్, పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులు, దాతల నుంచి విరాళాలుగా (నగదు లేదా వస్తు రూపంలో) తీసుకోవాలని ఎమ్మెల్యే రాజు భావిస్తున్నారు.