పర్యాటకులకు సరికొత్త అనుభూతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:30 PM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలగనుంది. ఎత్తైన కొండపైన ప్రకృతిని ఆస్వాదిస్తూ బస చేసేందుకు అనువుగా సరికొత్త జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఏర్పాటు చేస్తున్నది.
లంబసింగిలో ప్రకృతిని ఆస్వాదిస్తూ బస చేసేలా 15 జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లు
పర్యాటకాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ
రూ.5.33 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
పనులు ప్రారంభించిన ఏపీటీడీసీ
నాలుగు నెలల్లో అందుబాటులోకి...
చింతపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలగనుంది. ఎత్తైన కొండపైన ప్రకృతిని ఆస్వాదిస్తూ బస చేసేందుకు అనువుగా సరికొత్త జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఏర్పాటు చేస్తున్నది. లంబసింగిలో పర్యాటకాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులకు అదనపు సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.5.33 కోట్లు విడుదల చేయడంతో కేరళ తరహాలో పర్యాటకులకు ప్రకృతి ఒడిలో విడిది కల్పించేందుకు 15 జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్ల ఏర్పాటు పనులను ఏపీటీడీసీ ప్రారంభించింది. నాలుగు నెలల్లో ఈ టెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. శీతాకాలం సీజన్‌లో లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు బస చేసేందుకు ఏపీటీడీసీకి చెందిన హరిత రిసార్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం హరిత రిసార్ట్స్‌లో ఎనిమిది సూట్లు, మూడు డీలక్స్, నాలుగు నాన్ ఏసీ టెంట్లు, కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ అందుబాటులో ఉన్నాయి. హరిత రిసార్ట్స్‌లో గదులకు భారీ డిమాండ్ ఉంది. లంబసింగిలో ప్రైవేటు రిసార్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికి పూర్తి స్థాయి సదుపాయాలు లేవు. దీంతో ఏపీటీడీసీ రిసార్ట్స్ గదులు లభించని పర్యాటకులు ప్రైవేటు రిసార్ట్స్‌లో బస చేస్తున్నారు. మెజారిటీ పర్యాటకులు నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో లంబసింగి చేరుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే లంబసింగిని సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబసింగిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మరో నాలుగు నెలల్లో సందర్శకులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో లంబసింగిని ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శించే అవకాశం ఉంది.
నాటి సంకల్పం.. నేడు కార్యరూపం
2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం లంబసింగిలో పర్యాటకులకు వసతి కల్పించేందుకు ప్రప్రథమంగా రూ.5 కోట్లు మంజూరు చేసింది. అదే ఏడాది రెవెన్యూ అధికారులు లంబసింగి- లబ్బంగి ప్రధాన రహదారిలో 18 ఎకరాల స్థలాన్ని రిసార్ట్స్ నిర్మాణాలకు కేటాయించారు. ఏపీటీడీసీ.. రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలంలో 40 రిసార్ట్స్ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే తొలి విడతగా మంజూరైన రూ.5 కోట్లతో 12 రిసార్ట్స్, ఒక మెయిన్ బ్లాక్(కాన్ఫరెన్స్, వెయిటింగ్, ఓపెన్ ఏరియా, రెస్టారెంట్) నిర్మాణాలకు పర్యాటకశాఖ పనులు ప్రారంభించింది. 2019 మార్చి నాటికి మెయిన్ బ్లాక్(జీ ప్లస్ టూ) 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. నాలుగు రిసార్ట్స్ నిర్మాణాలు 80 శాతం పూర్తి చేశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో రిసార్ట్స్ నిర్మాణాలకు బ్రేక్ పడింది. దీంతో ఏపీటీడీసీ బ్యాంక్ రుణాల ద్వారా నిధులను సమీకరించుకుని 2022 డిసెంబరు నాటికి రిసార్ట్స్ నిర్మాణాలను పూర్తి చేసింది.
లంబసింగి అభివృద్ధికి పెద్దపీట
ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం లంబసింగిలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరకులోయ, లంబసింగి అభివృద్ధికి ఇప్పటికే స్వదేశీ దర్శన్ ద్వారా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. స్వదేశీ దర్శన్ పథకం ద్వారా అరకులోయ, లంబసింగి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అలాగే హరిత రిసార్ట్స్‌లో పర్యాటకులకు అదనపు సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. లంబసింగిలో ప్రకృతికి హాని కలగకుండా జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లు నిర్మించనున్నారు. ఈ టెంట్లలో బస చేసే పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. మంచు అందాలు, ప్రకృతిని ఆస్వాదిస్తూ బస చేసేందుకు అనువుగా ఇది ఉంటుంది.
జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లు ఇలా..
లంబసింగి హరిత రిసార్ట్స్ కొండపైన సువిశాలంగా 15 జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్ల నిర్మాణానికి ఏపీటీడీసీ ప్రతిపాదనలు పంపించిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. దీంతో ఏపీటీడీసీ అధికారులు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ టెంట్లు గ్లోబ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క టెంట్‌ను 725 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మిగతా ప్రాంతంలో పిల్లలు ఆడుకునేందుకు ఓపెన్ ఏరియా ఉంటుంది. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్ల ఈవీ బుగ్గీలు రెండు అందుబాటులో ఉంచుతారు. ప్రతి టెంట్‌లో 7/6 బెడ్, రాకింగ్ చైర్, 3/3 సైడ్ టేబుళ్లు, వార్డ్‌రోబ్, లగేజ్ ర్యాక్, డ్రెస్సింగ్ టేబుల్, నాలుగు కుర్చీలతో కూడిన కాఫీ టేబుల్, తదితర సదుపాయాలు ఉంటాయి.