ప్రైవేటు వైద్యుల నయా దందా!
ABN , Publish Date - May 18 , 2026 | 12:42 AM
వైద్య రంగాన్ని అవినీతి జబ్బు పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రులకు సైతం సోకింది.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లకు లంచాలు
రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్న వైనం
గత్యంతరం లేక ముట్టజెబుతున్న రోగుల కుటుంబాలు
నగరంలోని చాలా ఆస్పత్రుల్లో ఈ తరహా వ్యవహారం
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
వైద్య రంగాన్ని అవినీతి జబ్బు పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రులకు సైతం సోకింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం. ఈ భారాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు, వారి బంధువులు మౌనంగా భరిస్తున్నారు.
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు...కేజీహెచ్, ఘోషాసుపత్రి, ఈఎన్‌టీ, చెస్ట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు నిర్వహించేం దుకు గతంలో కొంతమంది వైద్యులు డబ్బులు అడుగుతుండేవారు. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తరువాత ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుండడంతో లంచాల బెడద చాలావరకు తగ్గింది. ఆ పథకం కింద వచ్చే మొత్తం సరిపోదని భావించినప్పుడు, పెద్ద ఆపరేషన్...రిస్క్‌తో కూడినదైతే ఇప్పుడు కూడా కొందరు ప్రభుత్వ వైద్యులు డబ్బులు తీసుకుంటున్నారు. అది పదివేల నుంచి 30 వేల రూపాయల వరకూ ఉంటుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులు లంచాలు అడుగుతున్నారు. ఇది నమ్మశక్యం కాని విషయం. నగరంలోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది.
నమ్మించి మోసం
గుండె, క్యాన్సర్, అవయవ మార్పిడి వంటి ఆపరేషన్లకు చాలామంది వసతులు, టెక్నాలజీ, మంచి వైద్యులు ఉంటారని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆపరేషన్ అవసరమని గుర్తించాక...దానికి ఎంత వ్యయం అవుతుంది?, ఎన్ని రోజులు ఉండాలి?... తదితర విషయాలన్నీ రోగుల బంధువులకు చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి, రోగిని ఆస్పత్రిలో చేర్చుకుని, ఆపరేషన్ తేదీ ఇచ్చాక...అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకు చూసిన డాక్టర్ షడన్‌గా వేళ గాని వేళ రోగి రూమ్‌కు వచ్చి వారి కుటుంబ సభ్యులను పిలిచి అసలు విషయం చెబుతున్నారు. ‘రేపు ఆపరేషన్ చేసేది నేనే. ఇక్కడ మీరు ఇంకో వారం రోజులు ఉండాల్సి ఉంటుంది. ఆస్పత్రితో సంబంధం లేకుండా లక్ష రూపాయలు ఇస్తే...మీకు అన్నీ బాగా జరిగేలా చూసుకుంటా. బిల్లులో డిస్కౌంట్ ఇప్పిస్తా. నాకు ఇచ్చే మొత్తంలో సగం అందులో కవర్ అయిపోతుంది. ఆలోచించుకుని చెప్పండి. ఒక గంటలో వస్తా.’ అని చెప్పి వెళ్లిపోతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో అలా అడుగుతారని ఊహించని సదరు రోగి బంధువులు అంతా చర్చించుకుని, 24 గంటల్లో ఆపరేషన్ పెట్టుకొని ఇప్పుడు గొడవపడినా లాభం లేదని, ఖర్చులో ఖర్చుగా భావించి డాక్టర్ అడిగినంతా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి వారికి ఆయా డాక్టర్లు లాస్ట్ సెటిల్‌మెంట్ బిల్లులో రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇప్పిస్తున్నారు.
ఓ కార్పొరేట్ సంస్థకు చెందిన ఆరిలోవ బ్రాంచిలో వారం క్రితం ఓ రోగికి అవయవ మార్పిడి చికిత్స చేశారు. రెండు కిడ్నీలు పాడైపోతే సమీప బంధువు కిడ్నీ దానం చేయగా, రోగికి అమర్చారు. మొత్తం రూ.15 లక్షల బిల్లు చేశారు. అందులో రూ.5 లక్షలు బీమా కంపెనీ ఇచ్చింది. ఈ ఆపరేషన్‌కు అక్కడి డాక్డర్ ఒకరు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. రోగి బంధువులు నిస్సహాయ స్థితిలో అడిగినంత ఇచ్చారు. డిశ్చార్జి చేసే సమయంలో వారికి ఆ డాక్టర్ తన తరఫున రూ.50 వేలు డిస్కౌంట్ ఇప్పించారు. ఇలాంటి వ్యవహారాలు ఆ ఒక్క ఆస్పత్రిలోనే కాకుండా హెల్త్ సిటీలోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇది కొత్త పోకడ అని, దీనిని ఎలా ఎదుర్కొనాలో తెలియడం లేదని వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
కార్పొరేట్ ఆస్పత్రుల్లో లంచాలు అడుగుతున్నారనే విషయం ఇప్పటివరకూ మాకు తెలియదు. ఎవరైనా అలా డిమాండ్ చేస్తే రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేస్తే విచారించి, తగిన చర్యలు తీసుకుంటాం. ఆపరేషన్ పూర్తయిన తరువాత, రోగి కోలుకున్నాక అయినా ఫిర్యాదు చేయవచ్చు. కాకపోతే దానికి తగిన సాక్ష్యాలు ఉండాలి. ఆడియో లేదా వీడియో రికార్డింగ్, డబ్బు ఇచ్చినట్టుగా బ్యాంక్ లేదా ఫోన్‌పే/గూగుల్ పే చెల్లింపు వంటి ఆధారాలు ఉంటే మంచిది.
- డాక్టర్ జగదీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి