Share News

నిరుద్యోగులకు వల

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:40 AM

విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

నిరుద్యోగులకు వల

ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలు

రూ.లక్షలు డిపాజిట్‌ కట్టించుకుంటున్న ఫేక్‌ కంపెనీలు

నెల, రెండు నెలల తరువాత బోర్డు తిప్పేస్తున్న వైనం

ఏ సంస్థ అయినా డబ్బు అడిగితే అప్రమత్తం కావాలంటున్న పరిశ్రమ పెద్దలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దరఖాస్తుదారుల నుంచి ‘డిపాజిట్‌’ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తరువాత బోర్డు తిప్పేస్తున్నాయి.

ఏడాది కిందట ఉనతి టెక్నాలజీస్‌ పేరుతో ఓ సంస్థ రామ్‌నగర్‌లో వెలిసింది. పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటన ఇవ్వడంతో సుమారు 200 మంది దరఖాస్తు చేశారు. జాబ్‌ కావాలంటే డిపాజిట్‌ కట్టాలని, ఏడాది తరువాత తిరిగి చెల్లిస్తామని, నెలకు రూ.20 వేల జీతం ఇస్తామని సంస్థ నిర్వాహకుడు సాయికృష్ణ నమ్మబలికాడు. కార్పొరేట్‌ ఆఫీస్‌ను చూసి చాలామంది నమ్మేశారు. ఒక్కొక్కరు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి ఉద్యోగంలో చేరారు. మొత్తం 140 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మొదటి నెల జీతం ఇచ్చి ఆ తరువాత రేపు, మాపు అనడంతో కొందరికి అనుమానం వచ్చింది. నిలదీస్తే ప్రాజెక్టులు వస్తాయని సర్దిచెప్పుకొచ్చాడు. నెలలు గడుస్తున్న కొద్దీ అందరికీ పరిస్థితి అర్థమైంది. గట్టిగా నిలదీసినా ప్రయోజనం లేకపోవడంతో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంక్వయిరీ చేస్తే విజయవాడలో కొద్దికాలం క్రితం ఇలాగే మోసం చేశాడని, విశాఖలో సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్టు తేలింది. రూ.1.5 లక్షలు కట్టిన వారికి రూ.20 వేల జీతమే దక్కింది. మిగిలింది నష్టపోయారు.

ఇంతకు ముందు మధురవాడలో వారుష్‌ ఐటీ టెక్నాలజీస్‌ పేరుతో వంకాయల సాయికుమార్‌ ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. జాబ్‌కి రిజిస్ట్రేషన్‌, ట్రైనింగ్‌ ఫీజు అంటూ లక్ష రూపాయల చొప్పున వసూలు చేశాడు. సుమారు 45 మంది డబ్బులు కట్టారు. నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రశ్నించారు. వారిని నిర్వాహకులు బెదిరించారు. దాంతో పీఎం పాలెం పోలీసులను బాధితులు ఆశ్రయించారు. కేసు నమోదైంది తప్పితే డబ్బులు వెనక్కి రాలేదు.

గత ఏడాది ద్వారకా నగర్‌లో ఓ సంస్థ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్ల స్కానింగ్‌ ఉద్యోగాలు (ఐటీ) ఇప్పిస్తామని రెండు లక్షల రూపాయల చొప్పున వసూలుచేసింది. ఇరవై మంది వరకు డబ్బులు కట్టారు. వారికి కొన్ని కార్యాలయాల్లో స్కానింగ్‌ డ్యూటీలు వేశారు. ఓ ఏజెన్సీ డాక్యుమెంట్ల స్కానింగ్‌ పనిని టెండర్‌ ద్వారా దక్కించుకొంది. దానికి ఐటీ ఉద్యోగాలు అని డిపాజిట్లు వసూలు చేసింది. దీనిపై కూడా పోలీసు కేసు నమోదైంది.

డిపాజిట్‌ అంటే మోసమే

ఓ.నరేశ్‌కుమార్‌, సీఈఓ, సింబయోసిస్‌ టెక్నాలజీస్‌

ఐటీ కంపెనీలు ఏవీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం డిపాజిట్లు తీసుకోవు. ట్రైనింగ్‌ కూడా సంస్థలే ఉచితంగా ఇస్తాయి. వాటికి కూడా ఫీజులు ఏమీ ఉండవు. వీటికి ఎవరైనా డబ్బు వసూలు చేస్తే అది ఫేక్‌ కంపెనీ కిందే లెక్క.

Updated Date - Apr 26 , 2026 | 01:40 AM