Share News

త్రుటిలో తప్పిన ముప్పు

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:49 AM

ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితుల కోసం మండలంలోని బోదిగల్లం ఆర్‌ఆర్‌ కాలనీలో చేపట్టిన వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనుల్లో ఆదివారం అపశ్రుతి చోటుచేసుకుంది. ట్యాంకు శ్లాబ్‌ వేస్తుండగా డెక్కింగ్‌ కదిలిపోయి సిమెంట్‌ కాంక్రీట్‌ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

త్రుటిలో తప్పిన ముప్పు
కాంక్రీట్‌ శ్లాబ్‌ కూలడంతో బయటకు కనిపిస్తున్న ఇనుప ఊచలు

బోదిగల్లం ఆర్‌ ఆర్‌ కాలనీలో కుప్పకూలిన వాటర్‌ ట్యాంకు శ్లాబ్‌

కాంక్రీట్‌లో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు

వెంటనే స్పందించి బయటకు తీసిన స్థానికులు

తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రి తరలింపు

కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు

నక్కపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితుల కోసం మండలంలోని బోదిగల్లం ఆర్‌ఆర్‌ కాలనీలో చేపట్టిన వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనుల్లో ఆదివారం అపశ్రుతి చోటుచేసుకుంది. ట్యాంకు శ్లాబ్‌ వేస్తుండగా డెక్కింగ్‌ కదిలిపోయి సిమెంట్‌ కాంక్రీట్‌ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

నక్కపల్లి మండలంలో ప్రైవేటు స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం పలు గ్రామాల్లో ఏపీఐఐసీ భూములు సేకరించిన విషయం తెలిసిందే. ఆయా గ్రామాల నిర్వాసితులకు బోదిగల్లం రెవెన్యూ పరిధిలో సహాయ, పునరావాస కాలనీ కోసం స్థలాలు కేటాయించారు. ఇక్కడ కొంతమంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయగా, మరికొందరు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. నిర్వాసితులకు తాగునీటి సరఫరా కోసం అధికారులు ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మిస్తున్నారు. పిల్లర్ల నిర్మాణం పూర్తికావడంతో ఆదివారం ట్యాంకు పైకప్పు శ్లాబ్‌ పనులు చేపట్టారు. సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సిమెంట్‌ కాంక్రీట్‌ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పాయకరావుపేటకు చెందిన షేక్‌ అభి, జగ్గంపేటకు చెందిన ఆదిశంకర్‌ అనే కార్మికులు సిమెంట్‌ కాంక్రీట్‌లో ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. వైద్య సేవల నిమిత్తం నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు చెప్పారు.

కాగా బోదిగల్లం ఆర్‌ఆర్‌ కాలనీలో నిర్మాణంలో వున్న వాటర్‌ ట్యాంకు కాంక్రీట్‌ శ్లాస్‌ కూలినట్టు తెలియడంతో రాష్ట్ర పౌరసరఫరా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోడపాటి శివదత్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎం.అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్‌ ట్యాంకు నిర్మాణంలో కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, అధికారుల పర్యవేక్షణ లేదని ఆరోపించారు. అదృష్టవశాత్తూ కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:49 AM