Share News

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:07 AM

టైర్లలో గాలి చెక్‌ చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్‌ కిందకు దిగగా, ఆ సీట్లు ఓ ఆగంతుకుడు కూర్చుని బస్సును డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకుపోయాడు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ముందుకు దూకించిన ఆగంతుకుడు

గుర్తించి అడ్డుకున్న కండక్టర్‌, ప్రయాణికులు

ఈలోగానే కారును ఢీకొట్టి బస్సు నుంచి దూకేసిన వైనం

అతడి మానసిక పరిస్థితి సరిగా లేదన్న పోలీసులు

మహారాణిపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

టైర్లలో గాలి చెక్‌ చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్‌ కిందకు దిగగా, ఆ సీట్లు ఓ ఆగంతుకుడు కూర్చుని బస్సును డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకుపోయాడు. డ్రైవర్‌ గుర్తించి కండక్టర్‌ను అప్రమత్తం చేయడంతో ప్రయాణికులతో కలిసి అడ్డుకున్నారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చోడవరం వెళ్లే 300 సి బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరింది. ప్రయాణికులందరికీ టికెట్లు ఇచ్చేందుకు సాధారణంగా ఎల్‌ఐసీ భవనం దాటిన తరువాత బస్సులు ఆపుతారు. ఈ క్రమంలో చోడవరం బస్సును డ్రైవర్‌ పెదిరెడ్ల అప్పారావు రోడ్డుపక్కన నిలిపారు. టైర్లలో గాలి చెక్‌ చేసుకుని, మూత్రవిసర్జనకు వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా బస్సును స్టార్ట్‌ చేసి, డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాడు. డ్రైవరే బస్సు నడుపుతున్నాడని భావించిన కండక్టర్‌ టికెట్లు ఇవ్వడంలో నిమగ్నమయ్యారు.. అయితే బస్సు వెళ్లిపోతుండడంతో గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై కండక్టర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. వెంటనే కండక్టర్‌ డ్రైవింగ్‌ సీటు వద్దకు వెళ్లి బస్సును ఆపమని గదమాయించడంతో నిందితుడు కంగారుపడ్డాడు. అప్పటికే బస్సు జగదాంబ జంక్షన్‌ వరకు చేరుకుంది. ఈ క్రమంలో అక్కడ ఓ కారును ఢీకొట్టి, ముందుకు వెళ్లి ఆగిపోయింది. బస్సును తీసుకువెళుతున్న వ్యక్తి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. అతడిని అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకుని టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అతడు మద్యం సేవించలేదని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే బస్సు నడిపాడని సమాచారం. విచారణలో పొంతన లేని సమాధానాలు ఇచ్చాడని పోలీసులు తెలిపారు. తాను విజయవాడకు చెందిన గువ్వ కిశోర్‌నని, భారీ వాహనాల డ్రైవింగ్‌ వచ్చునని చెప్పాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


దైవదర్శనానికి వెళ్లి.. వస్తూ

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

అరిణాం అక్కివలసలో విషాదం

మృతులు విశాఖ వాసులు

ఎచ్చెర్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

ఆ తల్లీకొడుకులిద్దరూ ఆదిత్యుడి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వారి ద్విచక్ర వాహనం...ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెప్పపాటులోనే తల్లీకొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నం నగరంలోని ఏవీఎన్‌ కళాశాల సమీపాన చెంగలరావుపేట చెందిన సీహెచ్‌ నాగమణి (55), ఆమె కుమారుడు నరేంద్రకుమార్‌ (32) శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ద్విచక్ర వాహనంపై అరసవల్లి వచ్చారు. ఆదిత్యుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరి వాహనం రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస జంక్షన్‌ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలో సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.

ఆ కుటుంబానికి దిక్కెవరు..

నరేంద్రకుమార్‌ రుషికొండలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది వయసు గల కుమార్తె ఉంది. తండ్రి ముత్యరాజు 2018లో మృతిచెందారు. తల్లీ, భార్య, పాపతో కలిసి ఉంటున్నారు. దైవదర్శనం నిమిత్తం వచ్చి..తల్లీకొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. రహదారులపై ఎక్కడపడితే అక్కడ లారీలను నిలిపివేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 01:07 AM