Share News

కొండలా చెత్త కుప్ప

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:27 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కార్యాలయం ఆవరణలో చెత్తాచెదారం కొండలా పేరుకుపోతున్నది. ఇక్కడి నుంచి కాపులుప్పాడకు చెత్తను తరలించే వాహనాలకు ఈ నెలకు ఇచ్చిన డీజిల్‌ కోటా మూడు రోజుల క్రితమే అయిపోవడంతో వాహనాలను నిలిపివేసినట్టు తెలిసింది. దీంతో పారిశుధ్య కార్మికులు పట్టణంలో సేకరించిన చెత్తను జోనల్‌ కార్యాలయం ఆవరణలో వేస్తుండడంతో భారీగా పేరుకుపోయింది.

కొండలా చెత్త కుప్ప
జోనల్‌ కార్యాలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్త. 30ఎకెపిటౌన్‌-11- (ఇన్‌సెట్‌లో): నిలిచిన చెత్త రవాణా వాహనాలు

జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో అధ్వాన పరిస్థితి

డీజిల్‌ కోటా అయిపోవడంతో నిలిచిన వాహనాలు

రేపటి వరకు ఇదే పరిస్థితి!

అనకాపల్లి టౌన్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కార్యాలయం ఆవరణలో చెత్తాచెదారం కొండలా పేరుకుపోతున్నది. ఇక్కడి నుంచి కాపులుప్పాడకు చెత్తను తరలించే వాహనాలకు ఈ నెలకు ఇచ్చిన డీజిల్‌ కోటా మూడు రోజుల క్రితమే అయిపోవడంతో వాహనాలను నిలిపివేసినట్టు తెలిసింది. దీంతో పారిశుధ్య కార్మికులు పట్టణంలో సేకరించిన చెత్తను జోనల్‌ కార్యాలయం ఆవరణలో వేస్తుండడంతో భారీగా పేరుకుపోయింది.

అనకాపల్లి పట్టణ శివారులోని కొత్తూరు శారదా నగర్‌ వద్ద గతంలో వున్న డంపింగ్‌ యార్డును పుష్కరకాలం క్రితం ఎత్తివేశారు. అప్పటి నుంచి పట్టణంలో సేకరించిన చెత్తను తొలుత జోనల్‌ కార్యాలయ ఆవరణలోకి తరలించి, ఇక్కడి నుంచి భారీ వాహనాల ద్వారా కాపులుప్పాడ పంపుతున్నారు. ఇందుకోసం ఆరు వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నెలావారిగా వాహనాలకు ఇచ్చే డీజిల్‌ కోటా మూడు రోజుల క్రితం అయిపోయింది. దీంతో ఆయా డ్రైవర్లు వాహనాలను నిలిపివేశారు. ఎప్పటికప్పుడు కాపులుప్పాడకు తరలించాల్సిన చెత్త... మూడు రోజుల నుంచి జోనల్‌ కార్యాలయం ఆవరణ నుంచి బయటకు వెళ్లడంలేదు. చెత్త కారణంగా సాధారణ రోజుల్లోనే పరిసర నివాసులు, జోనల్‌ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న జీవీఎంసీ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా మూడు రోజుల నుంచి చెత్త తరలించకపోవడం, అడపాదడపా వర్షం కురుస్తుండడంతో కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. జోనల్‌ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. చెత్తను తరలించకపోవడంపై శానిటేషన్‌ విభాగం అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందని, శనివారం నుంచి యథావిధిగా చెత్త తరలింపు జరుగుతుందని చెప్పారు.

Updated Date - Jul 31 , 2026 | 12:27 AM