ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శం
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:10 AM
విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల కృషి, ప్రజల ఆలోచనా విధానంలో మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో గణనీయంగా ప్రవేశాలు పెరిగాయి.
వేములపూడి ఎంపీపీ స్కూలులో రికార్డుస్థాయిలో ప్రవేశాలు
ఈ ఏడాది కొత్తగా 88 మంది విద్యార్థులు చేరిక
వీరిలో 67 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి రాక
మొత్తం 121కి చేరిన విద్యార్థులు
గత ఏడాది 1-5 తరగతుల్లో 61 మంది మాత్రమే..
హెచ్‌ఎం, టీచర్ల కృషితో గణనీయంగా పెరిగిన అడ్మిషన్లు
నర్సీపట్నం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల కృషి, ప్రజల ఆలోచనా విధానంలో మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో గణనీయంగా ప్రవేశాలు పెరిగాయి. అత్యధిక అడ్మిషన్లతో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో (ఆర్‌జేడీ పరిధి) నర్సీపట్నం మండలం వేములపూడిలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కొత్తగా 88 మంది విద్యార్థులు చేరగా, వీరిలో 67 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి రావడం విశేషం. ఈ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో మొత్తం 61 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో ఐదో తరగతి విద్యార్థులు 28 మంది ఆరో తరగతిలో చేరడానికి ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోయారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు 33 మంది విద్యార్థులు మిగిలారు. కాగా ప్రభుత్వ ఆదేశాలు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు పాఠశాలలో ప్రవేశాలను పెంచడానికి ప్రధానోపాధ్యాయులు బీఎస్‌ఆర్ గోవింద, ఉపాధ్యాయులు కలిసి విశేష కృషి చేశారు. ఉన్న విద్యార్థులు ప్రైవేటు బాట పట్టకుండా వుండేందుకు, కొత్తగా వీలైనంత ఎక్కువ మందిని పాఠశాలల్లో చేర్చుకోవడానికి ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలో సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫారం, మధ్యాహ్న భోజనం, తదితర వాటి గురించి వారికి వివరించి అవగాహన కల్పించారు. దీంతో గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదివిన తమ పిల్లలను ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. పాఠశాలలు తెరిచేనాటికి 88 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరిలో 67 మంది రికార్డు ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారు కావడం విశేషం. సోమవారంనాటికి వేములపూడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 121 మంది విద్యార్థులు వున్నారు. ఈ నెలాఖరులోగా మరికొంత మంది విద్యార్థులు చేరే అవకాశం వుందని ప్రధానోపాధ్యాయుడు గోవింద తెలిపారు. కాగా ఈ నెల 19న కశింకోటలో జరిగిన జిల్లాస్థాయి విద్యా శాఖ సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఈ పాఠశాల పేరును ప్రస్తావించి అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పిల్లలు!
చోడవరం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు చెబుతున్న ఉపాధ్యాయులు... తమ పిల్లలను మాత్రం ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు చదివిస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో మాన్పించి, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పార్థసారథి, రొంగలి చిరంజీవి, బీవీకే కిశోర్, కేవీ శ్రీను, ఎన్.గోవింద్ తమ కుమార్తెలను (ఏడుగురు) స్థానిక కొత్తూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. అక్షయ వాగ్దేవి, రొంగలి లేఖన, మేఘన పదో తరగతి, లక్ష్మీసహస్ర, దీపిక 8వ తరగతి, ఆరోహీ, జాస్విత 7వ తరగతి చదువుతున్నారు.