అప్పన్నదొరపాలెంలో భారీ కంపెనీ?
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:31 AM
అప్పన్నదొరపాలెంలో భారీ కంపెనీ?
జాయింట్ కలెక్టర్‌తో కలిసి భూముల పరిశీలన
500 ఎకరాలు అవసరమన్న కంపెనీ ప్రతినిధులు
మాకవరపాలెం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. ఇందుకు 500 ఎకరాలు అవసరం కావడంతో మంగళవారం సదరు కంపెనీ ప్రతినిధులతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ ఇక్కడకు వచ్చి పరిశీలించారు. మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, తూటిపాల రెవెన్యూ పరిధిలో 4,250 ఎకరాల డి.పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములను ల్యాండ్ బ్యాంకుగా అధికారులు గుర్తించారు. గతంలో ఈ భూములను ఏపీఐఐసీ ఎండీతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్, కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. అప్పట్లో బ్లాక్‌స్టోన్ కంపెనీ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను చూసి వెళ్లారు. తరువాత ఈ భూమికి ఎనిమిది కిలోమీటర్ల పొడవున, 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రణాళికను తయారు చేశారు. ఈ నేపఽథ్యంలో తూటిపాల రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెం వద్ద కంపెనీ ఏర్పాటుకు సుమారు 500 ఎకరాలు అవసరమంటూ మంగళవారం సదరు కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్, జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్న కంపెనీ ఏమిటన్నది వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ అధికారులతోపాటు తహశీల్దార్ కాకర నూకరాజు, మండల సర్వేరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.