Share News

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:16 PM

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, అందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పేదరిక నిర్మూలనకు కృషి

15,015 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న 2,919 మంది మార్గదర్శకులు

పల్లె పండుగలో భాగంగా రూ.77.57 కోట్లతో రహదారుల నిర్మాణం

7,700 ఎకరాల ఆయకట్టుకు రూ.18 కోట్లతో సాగునీటి సదుపాయం

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ఘనంగా గణతంత్ర వేడుకలు

పాడేరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, అందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. గిరిజనుల కోసమే ఏర్పాటైన ఈ జిల్లాలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతిని సాధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ప్రతి ఏడాది 15 శాతం వృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా జిల్లాలోని 2,919 మంది మార్గదర్శకులు 15,015 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని, వారి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని, పల్లె పండుగలో భాగంగా రూ.2 కోట్ల 61 లక్షల వ్యయంతో 11 సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్లు, రూ.51 కోట్ల 96 లక్షల వ్యయంతో 35 తారురోడ్లు, రూ.23 కోట్లతో 19 మెటల్‌ రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.431 కోట్ల వ్యయంతో పశువులకు నీటి తొట్టెలు, పంట కుంటలు, చెరువులు తవ్వడంతో పాటు ఉపాధి శ్రామికులకు వంద రోజుల ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా లక్షా 6 వేల 741 కుటుంబాలకు ఇంటింటా కొళాయిలు సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో 107 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, 827 ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 7,700 ఎకరాల ఆయకట్టుకు రూ.18 కోట్లతో సాగునీటి సదుపాయాలు కల్పించామని, రైతు సాధికారత సంస్థఽ ద్వారా 66,131 మంది రైతులకు చెందిన లక్షా 2 వేల 681 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారని, 2029- 30 ఆర్థిక సంవత్సరానికి జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఖరీఫ్‌ సాగు 7,749 హెక్టార్లు పెరిగి రూ.61 కోట్ల విలువ జోడింపుతో పాటు 2025- 26 లో లక్షా 4 వేల 843 మంది రైతు కుటుంబాలకు రూ.144 కోట్ల 94 లక్షల ఆర్థిక సాయం అందిందన్నారు. ఉద్యానవనశాఖలో 40 శాతం రాయితీపై మౌలిక సదుపాయాల నిధి పథకంలో రూ.30 లక్షలతో 5 కలెక్షన్‌ సెంటర్లు, 3 కోల్డ్‌ రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌లో భాగంగా జిల్లాలో 327 హెక్టార్లలో అవకాడో, లిచీ, పైనాపిల్‌, స్ట్రాబెరీ వంటి ఉద్యాన పంటల విస్తరణకు రూ.114 కోట్లతో, పుట్టగొడుగుల పెంపకం, వ్యవసాయ చెరువులు, ప్యాక్‌ హౌస్‌లు, కోల్డ్‌ రూమ్‌, సోలార్‌ డ్రైయర్లు, సేకరణ కేంద్రాలు, తేనెటీగల పెంపకం వంటి వాటికి రూ.175 కోట్లతో అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 90 శాతం రాయితీతో మిరియాల యంత్రాలు, ఇతర పరికరాలు, శిక్షణలు అందిస్తున్నామని, సుగంధ ద్రవ్య పంటలను ప్రోత్సహించేందుకు జిల్లాలో స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ, ఎకో పల్పింగ్‌ యూనిట్ల ఏర్పాటు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టుపరిశ్రమ శాఖ ద్వారా 350 మంది రైతులు 655 ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతూ పట్టుపురుగుల పెంపకం ద్వారా ఏడాదికి రూ.లక్షన్నర వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారని, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానించి 90 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. సూక్ష్మ నీటి పారుదల శాఖ ద్వారా ఈ ఏడాదిలో 2 వేల హెక్టార్లలో 255 మందికి లబ్ధి, మత్స్యశాఖ ద్వారా 276 మంది గిరిజన మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా 5 లక్షల చేపపిల్లల ఉత్పత్తి, పశు సంవర్థకశాఖలో 11 వందల మంది గిరిజన రైతులకు రూ.44 లక్షల వ్యయంతో 200 టన్నుల దాణా పంపిణీ, సూపర్‌ సిక్స్‌లో రేషన్‌కార్డున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా, ఎన్‌టీఆర్‌ భరోసాలో భాగంగా లక్షా 21 వేల 907 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.51 కోట్ల పెన్షన్‌ సొమ్ము పంపిణీ, స్వయం సహాయ సంఘాలకు రూ.318 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించామని కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే గృహ నిర్మాణంలో భాగంగా 28,691 మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదని, 1,11,789 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో తల్లికి వందనంలో భాగంగా 145 కోట్లు జమ అయ్యాయని, గిరిజన సంక్షేమ శాఖ విద్యాశాఖలో 848 విద్యా సంస్థల్లో 77 వేల మంది విద్యార్థులకు ఆశ్రమ విద్య అందుతున్నదని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 6,556 వైద్య శిబిరాల్లో వందల మంది రోగులకు వైద్య సేవలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్ల ద్వారా వైద్య సహాయం అందుతున్నదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. అలాగే జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 11:16 PM