Share News

మాకవరపాలేనికి త్వరలో భారీ పరిశ్రమ

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:57 AM

మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపియ్యపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గుర్తించిన ల్యాండ్‌ భ్యాంకు భూముల్లో త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నదని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన చామంతిపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.

మాకవరపాలేనికి  త్వరలో భారీ పరిశ్రమ
మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ల్యాండ్‌ బ్యాంకు భూముల్లో ఏర్పాటుకు చర్యలు

ఆయా భూములకు 100 అడుగుల వెడల్పుతో రహదారులు

పనులను ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

మాకవరపాలెం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పైడిపాల, పెద్దిపాలెం, బూరుగుపాలెం, పాపియ్యపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గుర్తించిన ల్యాండ్‌ భ్యాంకు భూముల్లో త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నదని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన చామంతిపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ గ్రామాల్లో ఇటీవల రెవెన్యూ అధికారులు 4,250 ఎకరాలను ల్యాండ్‌ బ్యాంక్‌గా గుర్తించారని, కొన్ని కంపెనీల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి భూములను పరిశీలించారని చెప్పారు. ఈ గ్రామాల్లో ప్రభుత్వ భూములతోపాటు డి.పట్టా భూములు అధికంగా ఉండడ, నీటి సదుపాయం కూడా ఉండడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్‌ తెలిపారు. ఈ నాలుగు గ్రామాల్లో భూ సేకరణ పూర్తయిన తర్వాత ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఇప్పటికే సర్వే నంబరు 737లో తీసుకున్న భూములకు సంబంధించి సాగుదారులకు మంచి ప్యాకేజీ ఇచ్చామని గుర్తుచేశారు. పరిశ్రమకు రవాణా సదుపాయం కోసం ఆయా భూములకు 100 అడుగుల వెడల్పుతో రోడ్లు వేయాలని అధికారులకు తెలియజేశామన్నారు. తన పేరు చెప్పుకొని రహదారుల నిర్మాణానికి అడ్డుపడేవారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్టు అయ్యన్న చెప్పారు. ఎరకన్నపాలెం భూముల్లో నుంచి భీమబోయినపాలెం మెయిన్‌రోడ్డుకు 100 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు మొదలయ్యాయని, అలాగే ల్యాండ్‌ బ్యాంకు భూముల దగ్గర నుంచి ఈ రహదారిని కలిపేలా 100 అడుగుల రోడ్డుతో రెవెన్యూ అధికారులు ప్రణాళికను తయారు చేశారన్నారు. ఎరకన్నపాలెం వాక రోడ్డు నుంచి ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి వరకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందు కోసం ఇప్పటికే రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. పరిశ్రమల కోసం తీసుకునే భూములకు చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని అడ్డుకునే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. భవిష్యత్తులో మాకవరపాలెం పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందుతుందని స్పీకర్‌ అయ్యన్న అన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు అల్లు రామునాయుడు, గోవిందు, రమణ తదితరులు వున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:57 AM